కాళోజీ సెంటర్: పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాల సవరణ ప్రక్రియపై జిల్లా విద్యాశాఖాధికారి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. యూడైస్ ప్లస్(యూడీఈఎస్‌ఈ +)పోర్టల్‌లోని ఎస్‌డీఎంఎస్ మాడ్యూల్ ద్వారా విద్యార్థుల పేరు, పుట్టిన తేదీ, లింగం, ఆధార్ వివరాల సవరణ సేవ ఇకపై కేవలం జిల్లాస్థాయి ఎంఐఎస్ యూజర్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుందని డీఈఓ రంగయ్య నాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల వివరాల సవరణకు సంబంధించి ఈ కింది నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన ఆదేశించారు
● ధ్రువీకృత ప్రత్రాలు : విద్యార్థి వివరాల సవరణకు హెచ్‌ఎం, మండల విద్యాధికారి సంతకాలతో ధ్రువీకరించిన అడ్మిషన్ రిజిస్టర్ ప్రతిని సమర్పించాల్సి ఉంటుంది.
● హెచ్‌ఎం వివరణ లేఖ : పోర్టల్‌లో వివరాలను సమర్పించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందో వివరిస్తూ హెచ్‌ఎంల నుంచి అధికారికి లేఖను జతచేయాలి.
● టైపింగ్ పొరపాట్లపై హామీ : ఒకవేళ టైపింగ్ పొరపాటు కారణంగా మార్పులు చేయాల్సి వస్తే మిగిలిన విద్యార్థుల వివరాలు సరైనవేనని, భవిష్యత్‌లో ఇలాంటి తప్పులు జరగవని పేర్కొంటూ హెచ్‌ఎం ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి.
● రిజిస్టర్ ప్రకారమే మార్పులు : విద్యార్థి వివరాల సవరణ కేవలం అడ్మిషన్ రిజిస్టర్‌లో నమోదైన వివరాలకు అనుగుణంగా మాత్రమే చేస్తారు. రిజస్టర్‌లోని వివరాలు, యూడైస్ పోర్టల్‌లోని వివరాలు భిన్నంగా ఉండడానికి వీలు లేదు.
● ప్రత్యేక ఫైల్ నిర్వహణ: విద్యార్థుల వివరాల సవరణలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలను పాఠశాలలో ప్రత్యేక ఫైల్‌గా భద్రపరచాలి.
పేరు పూర్తిగా మారాలంటే ఇవి తప్పనిసరి
విద్యార్థి పేరును పూర్తిగా మార్చాలన్నా లేదా ప్రధాన మార్పులు చేయాలన్నా ఈ ఆధారాలు సమర్పించడం తప్పనిసరి అని డీఈఓ పేర్కొన్నారు. తల్లిదండ్రుల నుంచి అభ్యర్థన పత్రం, ప్రధానోపాద్యాయుల నివేదిక, మండల విద్యాధికారి సంతకంతో కూడిన ధ్రువీకరణ, అఫిడవిట్, అందుబాటులో ఉంటే జనన ధ్రువీకరణ పత్రం సమర్పించాలని ఆయన తెలిపారు.
కీలక మార్గదర్శకాల అమలు తప్పనిసరి
విద్యార్థుల జనాభా వివరాల సవరణ సేవను దుర్వినియోగం చేసినట్లు తేలితే సంబంధిత అధికారులపై నిబంధనల ప్రకారం కఠన చర్యలు తీసుకుంటాం. హెచ్‌ఎంలు అందరూ పూర్తి ఆధారాలతో కూడిన ప్రతిపాదనలు మాత్రమే సమర్పించాలి. కీలక మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలి.
– బి.రంగయ్యనాయుడు డీఈఓ


