ఖిలా వరంగల్: వరంగల్ శివనగర్‌లోని ఎస్సీ బాలికల వసతిగృహాన్ని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, భోజన శాల, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్, విద్యార్థినులకు కల్పించిన వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. హాస్టల్ నిర్వహణ, పరిశుభ్రత, ఆహార నాణ్యతపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థినులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహాల్లో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని, విద్యార్థినులకు నాణ్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలని, తాజా కూరగాయలను మాత్రమే ఉపయోగించాలని హాస్టల్ వార్డెన్‌ను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థినులకు అల్పాహారం, భోజనం, ఇతర ఆహార పదార్థాలు అందేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థినుల ఆరోగ్యం, విద్యాభాసంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదువులో రాణించాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో డీఎస్‌సీడీఓ భాగ్యలక్ష్మి, డీబీసీడీఓ పుష్పలత, డీటీడీఓ నారాయణ, అధికారులు పాల్గొన్నారు


