న్యూశాయంపేట: గ్రీవెన్స్‌లో వచ్చిన అర్జీలను అధికారులు పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో మొత్తం 202 దరఖాస్తులు నమోదయ్యాయని ఆమె తెలిపారు. రెవెన్యూ 64, మున్సిపల్ 48, హౌసింగ్ 22, డీఆర్‌డీఓ 10, ఇతర శాఖలకు సంబంధించి 58 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ పేర్కొన్నారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, అధికారులు పాల్గొన్నారు.
భారీగా తరలివచ్చిన ప్రజలు..
కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌కు ప్రజలు భారీగా తరలివచ్చారు. మండలస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కలెక్టరేట్‌కు వచ్చి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కలెక్టర్ సైతం అర్జీలను వరుస క్రమంలో స్వీకరించారు. సమస్యలను చెప్పుకునేందుకు ప్రజలకు అవకాశం కల్పించారు. సాధారణంగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు గ్రీవెన్స్ ముగియాల్సి ఉంది. ప్రజలు ఎక్కువగా తరలిరావడంతో సాయంత్రం వరకు అధికారులు అర్జీలను స్వీకరించారు. దీంతో రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు లంచ్ బ్రేక్ కూడా తీసుకోకుండా విధులు నిర్వర్తించారు.
గంటసేపు భోజన విరామం ఇవ్వండి..
ఉదయం అల్పాహారం తీసుకుని అధికారులు, సు దూర ప్రాంతాల నుంచి ఫిర్యాదుదారులు గ్రీవె న్స్‌కు వచ్చారు. అయితే, మధ్యాహ్నం గంటసేపు విరామం ఇవ్వాలని వారు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. క్యూలో నిల్చోలేక ఫిర్యాదుదారులు, సమయం తెలియకుండా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు విరామం ఇవ్వాలని కోరుతున్నారు.
అధికారులకు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశం


