బడికి వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

బడికి వేళాయె..

Jun 15 2026 7:28 AM | Updated on Jun 15 2026 7:28 AM

సాక్షి, వరంగల్‌/కాళోజీ సెంటర్‌: వేసవి సెలవుల అనంతరం జిల్లాలో నేటి (సోమవారం) నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 2026–27 విద్యా సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించేందుకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సుదీర్ఘ విరామం తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయులు కొత్త ఉత్సాహంతో బడిబాట పట్టనుండగా, తొలి రోజే విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలికేందుకు పాఠశాల యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, స్థానిక సంస్థలు, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు, తెలంగాణ మోడల్‌ స్కూళ్లు, అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు, తెలంగాణ గురుకుల విద్యాసంస్థలు, ఎయిడెడ్‌, గుర్తింపు పొందిన ప్రైవేట్‌ పాఠశాలలు కలిపి మొత్తం 1,017 విద్యాసంస్థలు ఉన్నాయి. వీటి ద్వారా వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లాలోని అధిక శాతం పాఠశాలల్లో రాష్ట్ర సిలబస్‌ ప్రకారం బోధన కొనసాగుతుండగా, కొన్ని ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ కూడా అమలులో ఉంది.

విద్యార్థుల చేరికలే లక్ష్యంగా..

ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తొలి రోజే పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు అందించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. అలాగే ‘ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచే దిశగా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఈనెల 11వ తేదీ నాటికి 1,759 మంది విద్యార్థులు ఎన్‌రోల్‌మెంట్‌ చేసుకోగా బాలికలు 831 మంది, బాలురు 928 మంది విద్యార్థులు ఉన్నారు.

ప్రభుత్వ బడులను ఆదరించాలి

ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలుస్తున్నాయి. అర్హత కలిగిన ఉపాధ్యాయులు, ఆధునిక సాంకేతికత ఆధారిత బోధన, మెరుగైన మౌలిక వసతులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, ముఖ్యమంత్రి అల్పాహార పథకం, మధ్యాహ్న భోజన పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను సమీప ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలి.

– బి.రంగయ్య నాయుడు, డీఈఓ

నేటి నుంచి జిల్లాలో పాఠశాలల పునఃప్రారంభం

తొలిరోజే పుస్తకాలు,

యూనిఫాం పంపిణీ

295 పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభం

19 వేల మందికి అల్పాహారం

ముఖ్యమంత్రి అల్పాహార పథకం అమలులో భాగంగా తొలి రోజు జిల్లాలోని ఏడు మండలాలు వరంగల్‌, ఖిలా వరంగల్‌, గీసుగొండ, సంగెం, దుగ్గొండి, నల్లబెల్లి, వర్ధన్నపేట పరిధిలో 295 పాఠశాలల్లో సోమవారం నుంచి ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా సుమారు 19 వేల మంది విద్యార్థులకు హరేకృష్ణ ట్రస్ట్‌ సహకారంతో అల్పాహారం అందించనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement