పొడి దుక్కిలో విత్తనాలు వేయొద్దు.. | - | Sakshi
Sakshi News home page

పొడి దుక్కిలో విత్తనాలు వేయొద్దు..

Jun 12 2026 7:25 AM | Updated on Jun 12 2026 7:25 AM

పొడి దుక్కిలో విత్తనాలు వేయొద్దు..

ప్రశ్న: పత్తి గింజలు ఎండలో పెడితే కరిగిపోయాయి. ఇప్పుడు ఏ పత్తి గింజలు నాటాలి? – మాదాసి వెంకటేశ్‌, వెంకటాపూర్‌

జవాబు: గింజలు వేడికి కరిగిపోతాయి. మార్కెట్‌లో ఉన్న అన్ని రకాలు మంచివే. షాపు వారు చెప్పినవే కాకుండా మీకు అనుభవమున్న ప్రకారం విత్తనాలు ఎంపిక చేసుకోవాలి.

సమృద్ధిగా వర్షాలు పడ్డాకే వేయాలి

వరిలో మధ్యకాలిక,

స్వల్పకాలిక రకాల సాగు మేలు

పచ్చిరొట్ట ఎరువుకు పెసరు బాగు

‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌లో హనుమకొండ జిల్లా

వ్యవసాయ అధికారులు విజయ్‌చంద్ర,

ఆదిరెడ్డి, శాస్త్రవేత్త నర్సయ్య

హన్మకొండ: సమృద్ధిగా వర్షం కురిసిన తర్వాతే విత్తనాలు విత్తాలని, పొడి దుక్కిలో విత్తితే రైతులు నష్టపోతారని హనుమకొండ జిల్లా వ్యవసాయాధికారి విజయ్‌ చంద్ర, సహాయ సంచాలకుడు ఆదిరెడ్డి, డాట్‌ సెంటర్‌ వ్యవసాయ శాస్త్రవేత్త నర్సయ్య అన్నారు. బుధవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హలో వ్యవసాయాధికారి’ కార్యక్రమంలో జిల్లాలోని రైతులు ఫోన్‌ ద్వారా సాగు, విత్తనాలు, ఎరువుల సమస్యలు తెలిపారు. వారికి అధికారులు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. సాగు ఆలస్యమవుతున్నందున వరిలో మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలు సాగు చేయడం మంచిందని, పచ్చిరొట్ట ఎరువు సాగులో పెసర విత్తి పంట తీసుకోవచ్చని ఇది రైతుకు లాభదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులు అడిగిన ప్రశ్నలు, అధికారుల సమాధానాల్లో కొన్ని ముఖ్యమైనవి ఇలా..

ప్రశ్న: నాకు మూడెకరాల భూమి ఉంది. ఏ వంగడాలు ఎంచుకోవాలి. – మేక చిరంజీవి, వెంకటాపూర్‌, ఐనవోలు

జవాబు: మార్కెట్‌లో లభించే మంచి రకాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రధానంగా 8 రకాలకు మాత్రం రేటు పడిపోదు. నూక తక్కువగా వస్తుంది. వరిలో ఆర్‌ఎన్‌ఆర్‌ 15048, కూనారం 1638, జగిత్యాల 2443, వరంగల్‌ 961, వరంగల్‌ 915, బీపీటీ, జై శ్రీరాం. హెచ్‌ఎంటీ, డబ్ల్యూజీఎల్‌ 962, డబ్ల్యూజీఎల్‌ 44, వరంగల్‌ సిద్ది వంటి రకాలున్నాయి. ఈ రకాలు మంచి దిగుబడిని ఇస్తాయి. దీర్ఘకాలిక రకాలు 150 నుంచి 160 రోజులు, మధ్యకాలిక రకాలు 130–140, స్వల్పకాలిక రకాలు 125 రోజుల్లో వస్తాయి. వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్‌లో విత్తనాలు కొనొద్దు. పత్తి ఇప్పుడే సాగు చేయొద్దు. వేడిలో పెడితే విత్తనాలు పాడవుతాయి, ఎలుకలు వంటి జీవరాశులు తింటాయి. 100 మిల్లీమీటర్ల వర్షం పడిన తర్వాతే విత్తాలి.

ప్రశ్న: పసుపు సాగు చేయాలి. సూచనలివ్వండి. అంతర్‌ పంటలు వేసుకోవచ్చా? – అనూష, దామెర

జవాబు: ప్రస్తుతం విత్తొద్దు. ఎండలు కొడుతుండడంతో భూమి లో వేడి అధికంగా ఉంది. బాగా వర్షాలు కురిసి నేలలో కావాల్సిన తేమ ఉన్నప్పుడే విత్తాలి. భూమిలో పశువుల, మేకల ఎరువు వేసి కలియదున్ని సిద్ధంగా ఉంచుకోవాలి. పసుపులో అనేక రకాల తెగుళ్లు వస్తాయి. దుంపకుళ్ల తెగులు ఎక్కువగా వస్తుంది. దీని నివారణకు ట్రైకోవిర్మిడితో విత్తన శుద్ధి చేసుకోవాలి. అంతర పంటగా మొక్కజొన్న, పెసర వంటివి సాగు చేసుకోవచ్చు.

ప్రశ్న: జీలుగ ఎప్పుడు వేసుకోవాలి?

– బి.సదయ్య, చెర్లపల్లి

జవాబు: వరి నాటుకు వెళ్లే 45 రోజుల ముందు వేసుకోవాలి. జీలుగ పూతకు వచ్చిన తర్వాత సూపర్‌ ఫాస్పేట్‌ వేసి పొలంలో కలియదున్నాలి. తర్వాత వరి నాటు వేసుకోవాలి. నారు పోసుకోవడానికి సమయం ఉంది. వెంటనే జీలుగా సాగు చేయండి.

ప్రశ్న: మిరప సాగు చేస్తున్నాం. వేరుకుళ్ల తెగుళ్లు బాగున్నాయి.. – నారాయణరావు, నడికూడ

జవాబు: మిరప సాగు చేసిన భూమిలో రొట్ట మీద బూజు వచ్చినట్లు నేలలోపల బూజు వస్తుంది. ఒకసారి మిరప సాగు చేశామంటే పంట మార్పిడి చేయాలి. మొక్కజొన్న, పెసర వంటి పంటలు వేస్తే నేలలోని విషపూరిత బూజు పోతుంది. ట్రైకోడర్మివిరిడిని ఏదేని ఎరువులు కలుపుకుని, కొంచెం బెల్లం పాకం కలిపి తడి బాగా ఉన్న సమయంలో భూమిలో వేసి కలియదున్నాలి. అప్పుడే భూమిలో వేరుకుళ్లు అవశేషాలు పూర్తిగా నశిస్తాయి.

ప్రశ్న: రెండున్నర ఎకరాలు బీర తోట పెట్టా. పూతకు వస్తుంది. ఆకుల మీద మచ్చలు వస్తున్నాయి? ఏం చేయాలి?

– మనోహర్‌, తిరుమలగిరి, ఆత్మకూరు మండలం

జవాబు: ఉద్యాన అధికారిని సంప్రదించండి. వరంగల్‌ ప్రాంతీయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు ఉన్నారు. వీరిని సంప్రదించండి. జాగ్రత్త కోసం సూడోమనోస్‌ నం నీటిలో కలిపి పిచికారీ చేస్తే తోటను కాపాడుకోవచ్చు.

ప్రశ్న: ఎరువుల ధరలు ఎంతమేర పెరిగాయి?

– రాజు, శాలపల్లి, సుధాకర్‌ పీచర, వేలేరు

జవాబు: డీఏపీ, యూరియా ధరలు పెరగలేదు. కాంప్లెక్స్‌ ఎరువులు మాత్రమే పెరిగాయి. ఎరువుల బస్తాలపై ఎమ్మార్పీ ముద్రించి ఉంటుంది. ఈ ధరకు కొనుగోలు చేయాలి. డీలర్లకు కూడా ఎమ్మార్పీకే అమ్మాలని ఆదేశాలిచ్చాం.

ప్రశ్న: పెసర్లు వేస్తే బాగుంటుందా. జీలుగ వేస్తే బాగుంటుందా?

– మేకల కేదారి యాదవ్‌, సోమిడి

జవాబు: పెసరు వేసుకుంటే వానలు పడకముందే పంట సేకరించడం ద్వారా ఆదాయం వస్తుంది. జీలుగ వేస్తే కేవలం పచ్చిరొట్టగానే పని చేస్తుంది. తెలంగాణ సీడ్స్‌ కార్పొరేషన్‌లో విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.

ప్రశ్న: వరిలో 1282 రకం సన్నాలు సాగు చేయవచ్చా. బోనస్‌ వస్తుందా? – కుమార్‌, కమలాపూర్‌

జవాబు: వరిలో 1282 బదులు కూనారం 1638 బాగుంటుంది. ఇది మధ్యకాలిక రకం 130 రోజులకు కోతకు వస్తుంది. బోనస్‌ వస్తుంది.

ప్రశ్న: పత్తి గింజలు నాసి రకం వస్తున్నాయి. రైతు ఎలా బాగుపడుతాడు? – రేగుల రవీందర్‌, అక్కంపేట, ఆత్మకూరు

జవాబు: ఎండకు పొడి దుక్కిలో విత్తొద్దు. విత్తనాలపై అనుమానం వస్తే వాపస్‌ ఇవ్వొచ్చు. కంపెనీని బట్టి విత్తనాలు సన్నగా, దొడ్డుగా ఉంటాయి. వ్యవసాయాధికారులు శాంపిళ్లు తీస్తున్నారు. పరీక్షలో నకిలీవని తేలితే చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న: పత్తి గింజలు విత్తి 10 రోజులు అవుతుంది. ఇప్పుడు తడి ఇవ్వొచ్చా? నకిలీవి ఎలా గుర్తుపట్టాలి?

– గుండెకారి నాగేశ్వర్‌రావు, దామెర

జవాబు: సాగునీటి వసతి ఉంటే వెంటనే తడి ఇవ్వండి. విత్తనం మొలకెత్తేలా చూడండి. లేకపోతే చీమలు తినడం వట్టిపోవడం జరుగుతుంది. నాలుగైదు రోజుల్లో తేలికపాటి వర్షం పడితే మరింత నష్టపోవాల్సి ఉంటుంది. పత్తి విత్తనాలు లైసెన్స్‌ ఉన్న డీలర్ల వద్ద కొనుగోలు చేస్తే వారు బిల్లు ఇస్తారు. దీనిపై అన్ని వివరాలుంటాయి. తేడా వస్తే కంపెనీ వారిచే మాట్లాడొచ్చు.

ప్రశ్న: పెసర్లు ఎలా విత్తాలి? ఏ రకాలు మేలైనవి?

– జయపాల్‌ రెడ్డి, ఆత్మకూరు

జవాబు: సాగునీటి వసతి ఉంటే దుక్కి తడిసిన తర్వాతనైనా, వర్షం సమృద్ధిగా కురిసిన తర్వాత విత్తనాలు భూమిలో చల్లి దున్నాలి. పొడి దుక్కిలో వేయొద్దు. ఎంజీజీ 285, ఎంజీజీ 295 రకాలు బాగుంటాయి.

ప్రశ్న: పత్తిలో ఏ రకం సాగు చేయాలి? ఇప్పుడు సాగుకు

అనుకూలమేనా? – గొట్టె శ్రీనివాస్‌, కమలాపూర్‌,

సాంబరాజు, ల్యాదెళ్ల

జవాబు: మార్కెట్‌లో అనుమతి ఉన్న విత్తనాలు అన్నీ మంచివే. గత అనుభవాన్ని బట్టి విత్తనాన్ని ఎంచుకోవాలి. నూతన రకం వాడితే వ్యవసాయాధికారులను సంప్రదించాలి. పత్తి సాగుకు వేచి చూడాలి. మూడు వర్షాలు కురిసిన తర్వాతే విత్తనాలు విత్తాలి. ఆరుద్ర కార్తె మొత్తం విత్తనాలు విత్తుకోవచ్చు.

ప్రశ్న: వ్యవసాయాధికారులు గ్రామాల్లో తిరగడం లేదు. ఫీల్డ్‌ సర్వే చేయకపోవడంతో కొనుగోళ్లు చేయలేదు.

– టేకుమట్ల విష్ణు, ధర్మసాగర్‌

జవాబు: వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో తిరగడం లేదనడం అవాస్తవం. ప్రతీ రోజు ఏదో ఒక గ్రామంలో రైతు రిజిస్ట్రీ చేస్తున్నారు. మొన్నటి వరకు గ్రామ సభల్లో పాల్గొన్నారు. ఏఈఓలు లేకుండా ఏ పని కాదు. వారు లేనిదే పంట కొనుగోళ్లు జరగవు. మాకు ప్రతీ రోజు రిపోర్టులు వస్తాయి. సేవల్లో లోపం ఉంటే ఫిర్యాదు చేయండి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement