ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
హన్మకొండ అర్బన్: మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ఏర్పాటు చేయనున్న పరకాల మహిళా డెయిరీని పటిష్ట ప్రణాళిక, సమర్థవంతమైన నిర్వహణతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్‌లో పరకాల మహిళా డెయిరీ పనుల పురోగతి, పాల ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యూహాలపై హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, డాక్టర్ సత్యశారద, వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పాల సేకరణ, ఉత్పత్తి, నాణ్యత, మార్కెటింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి డెయిరీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న పాల బ్రాండ్ల విక్రయాలు, వినియోగదారుల అభిరుచులు, పోటీ పరిస్థితులు, మార్కెటింగ్ వ్యూహాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సమావేశంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రాజేశ్వర్‌రావు, అదనపు డీఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీపీఎం సరిత, ఏపీఎం దివాకర్‌రాయ్, పరకాల మహిళా డెయిరీ జనరల్ మేనేజర్ కృష్ణ, మెప్మా డీఎంసీలు రజిత రాణి, రేణుక, టీఎంసీలు వెంకట్‌రెడ్డి, రమేశ్, సీఓలు పాల్గొన్నారు.


