విద్యారణ్యపురి: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలను శనివారం అధికారులు విడుదల చేశారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. టెన్త్ పరీక్షలకు 3,357 మంది విద్యార్థులు హాజరుకాగా.. అందులో 2,792 మంది (83.17 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. టెన్త్‌లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 92.09 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో రెండో స్థానాన్ని సాధించిందని ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కో–ఆర్డినేటర్ ఎ.సదానందం తెలిపారు. మహబూబాబాద్ జిల్లా 91.72 శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానం, ములుగు జిల్లా 90.62 శాతం ఉత్తీర్ణతతో ఐదో స్థానం, హనుమకొండ జిల్లా 89.04 శాతం ఉత్తీర్ణత ఏడో స్థానంలో నిలిచింది. హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్ విద్యార్థులను అభినందించారు.
ఇంటర్‌లో రాష్ట్రస్థాయిలో ములుగు జిల్లా ఫస్ట్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలకు 6,568 మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 5,174 మంది (78.78 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ములుగు జిల్లా 81.66 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని కోఆర్డినేటర్ ఎ.సదానందం తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా 81.51 శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
ప్రతిభ కనబర్చిన
ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు
టెన్త్‌లో 83.17 శాతం,
ఇంటర్‌లో 78.78 శాతం ఉత్తీర్ణత


