ఖమ్మం రోడ్డులో ప్రైవేట్ భవనాలపై హోర్డింగులు
వరంగల్ అర్బన్: నగరంలో బలహీన హోర్డింగులు, చిరిగిపోయిన ఫ్లెక్సీలు నగరవాసులను భయపెడుతున్నాయి. బలమైన గాలులు వీచినప్పుడు ఏ హోర్డింగ్, ప్లెక్సీ అయినా వాహనదారులపై, బాటసారులపై పడితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆదాయంపై దృష్టి సారించిన బల్దియా.. నగర ప్రజల రక్షణను గాలికొదిలేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనేక చోట్ల ప్రమాదాలు జరుగుతున్నా అధికారుల్లో చలనం కనిపించట్లేదనే విమర్శలున్నాయి. గతంలో న్యాయస్థానాలు హోర్డింగులు, యూనిపోల్స్, ఫ్లెక్సీలతో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించేందేందుకు చొరవ తీసుకోకపోవడంపై ప్రజల్లో కలవరం వ్యక్తమవుతోంది.
అనధికారమే అధికం
హోర్డింగులు, యూనిపోల్స్, ఫ్లెక్సీల ఏర్పాటులో బల్దియా అధికారులు నిబంధనలు పాటించారా? త గు జాగ్రత్తలు చేపడుతున్నారా? అనే అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. బల్దియా టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ జంక్షన్లలో, పలు భవనాలపై ఏర్పాటు చేసిన ప్రకటనల హోర్డింగ్ తీరును పరిశీలించిన దాఖలాలు లేవు. నగరంలో ఎక్కడ చూసినా రోడ్ల వెంట ప్రకటన ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. నగర పరిధిలో 1,200 వరకు హోర్డింగ్‌లున్నాయి. బల్దియా నుంచి అనుమతి పొందకుండానే సగానికి పైగా ఇష్టానుసారంగా హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు.
చర్యల మాటేంటి?
అనుమతులు లేకుండా వెలుస్తున్న ప్రకటనల బోర్డులపై చర్యలు తీసుకునేందుకు బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు సహసించడం లేదని తెలుస్తోంది. యాడ్ సంస్థలకు రాజకీయ నేతల అండదండలు ఉండడంతో ఏమీ చేయలేకపోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. హోర్డింగులు, ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో కనీస రక్షణ చర్యలు తీసుకోవడం లేదని, కేవలం స్వీయ నిర్ధారణ పత్రాలు తీసుకోవడంతోనే సరిపెడుతున్నారని తెలుస్తోంది. కొందరు బల్దియా సిబ్బంది కొన్ని ప్రైవేట్ సంస్థలతో లోపాయికారీ ఒప్పందం చేసుఉని నిబంధనలు పాటించకపోయినా లైట్‌గా తీసుకుంటున్నారనే ఆరోపణలన్నాయి. నగరంలో ఏటా గాలులు, భారీ వర్షాల సమయంలో అనేక చోట్ల హోర్డింగులు, ఫ్లెక్సీలు, కటౌట్లు ధ్వంసమవుతున్నాయి. చెదురుముదురుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదైనా ప్రమాద ఘటన చోటు చేసుకున్న తర్వాత హడావు డి చేస్తూ తదుపరి నివేదికలతో మమ అనిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈవిషయంపై బల్దియా ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. నగర పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగులు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని.. ప్రమాణాలు పాటించకపోతే హోర్డింగ్‌లు తొలగిస్తామని తెలిపారు.
‘గ్రేటర్’వాసులను కలవరపెడుతున్న బలహీన హోర్డింగులు
గట్టిగా గాలొచ్చినా నేలకొరిగే ప్రమాదం!
నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు
పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికార యంత్రాంగం
గ్రేటర్ వరంగల్ ఆదాయానికి గండి
నిబంధనలేం చెబుతున్నాయంటే..
ఏదైనా ఒక భవనంపై హోర్డింగ్ ఏర్పాటు చేయాలంటే సంబంధిత నిర్మాణం పటిష్టంగా ఉందో లేదో పరిశీలించాలి. భవన పటిష్టత, హోర్డింగ్ ఐరన్, నిర్దేశిత సైజు, స్థాయిలో ఉందా లేదా? అనేది చూడాలి.
ప్రజాప్రయోగ (పబ్లిక్ ప్లేసెస్) ప్రాంతాల్లో కూడళ్లలో బహిరంగ ప్రచారం నిషేధం.
నడిరోడ్లపై, ట్రాఫిక్ సిగ్నళ్ల వాహనాలు మూలమలుపుల వద్ద ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్పత్రులు, పార్కులు, శ్మశాన వాటికల వద్ద ప్రచారాలను అనుమతించకూడదు.
మహా నగర పాలక సంస్థ అనుమతి తీసుకోకుండా చిన్న వాల్ పోస్టర్ కూడా అంటించకూడదు. దీన్ని ఎవరూ ఉల్లంఘించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
నిబంధనలు పాటించకుండా హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తే రూ.5 వేలకు పైగా జరిమానా విధిస్తారు. అయినప్పటికీ తీరు మార్చుకోకపోతే పబ్లిక్ న్యూసెన్స్ కేసు నమోదు చేస్తారు.


