సీఎం ఓవర్సీస్‌ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

సీఎం ఓవర్సీస్‌ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

May 31 2026 1:12 AM | Updated on May 31 2026 1:12 AM

న్యూశాయంపేట: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు సీఎం ఓవర్సీస్‌ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు మైనార్టీ విద్యార్థుల (ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, జైనులు) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేష్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్‌ 30వ తేదీ వరకు డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.తెలంగాణఈపాస్‌.సీజీజీ.జీఓవీ.ఇన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 93988 60995 నంబర్‌లో లేదా సుబేదారిలోని షరీఫన్‌ మసీదు ఎదురుగా ఉన్న జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు.

మహిళలను కోటీశ్వరులను చేయడమే సర్కారు లక్ష్యం

నల్లబెల్లి: గ్రామీణ ప్రాంతాల మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని రేలకుంట, ముచ్చింపుల, అర్షనపల్లి, కొండాపూర్‌, ఒల్లె నర్సయ్యపల్లి గ్రామాల్లో ఆయన శనివారం పర్యటించారు. ఆయా గ్రామాల్లో రూ.66 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్‌వాడీ కేంద్రాలు, మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేలకుంట, ముచ్చింపుల, కొండాపూర్‌ గ్రామాల్లో రూ.10 లక్షల చొప్పున గ్రామైక్య మహిళా సంఘాల భవనాలు, అర్షనపల్లి, బుచ్చిరెడ్డిపల్లి, అర్వయ్యపల్లి గ్రామాల్లో రూ.12 లక్షల వ్యయంతో అంగన్‌వాడీ భవన నిర్మాణా పనులకు శంకుస్థాపన చేపట్టినట్లు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఈ మేరకు పలువురు కాంగ్రెస్‌లో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్‌ ముప్పు కృష్ణ, పీఆర్‌ డీఈ శ్రీకాంత్‌ రెడ్డి, ఏఈ అమీర్‌, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ హేమలత, ఏపీఓ సుధాకర్‌, కాంగ్రెస్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

అతివల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

గీసుకొండ: అతివల ఆర్థికాభివృద్ధే ధ్యేయమని, పొదుపు సంఘాల మహిళా సభ్యులను కోటీశ్వరులను చేయాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఎలుకుర్తి, ఆరెపల్లి, చంద్రయ్యపల్లి, ఊకల్‌, గంగదేవిపల్లి, కొనాయమాకుల, విశ్వనాథపురం, మరియపురం, శాయంపేట గ్రామాల ఇందిర మహిళా శక్తి భవనాల నిర్మాణ పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మహిళలకు వడ్డీలేని రుణ పరిమితిని రూ.10 లక్షలకు పెంచిందని ఎమ్మెల్యే గుర్తుచేశారు. మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దారు రియాజుద్దీన్‌, ఎంపీడీఓ కృష్ణవేణి, పీఆర్‌ డీఈ జ్ఞానేశ్వర్‌, ఏఈ అనిల్‌, ఎంపీఓ పాక శ్రీనివాస్‌, సెర్ప్‌ ఏపీఎం ముక్కెర ఈశ్వర్‌, సర్పంచ్‌లు, కాంగ్రెస్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement