న్యూశాయంపేట: జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఖిలా వరంగల్‌లోని ఖుష్ మహల్‌లో ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని సమావేశ హాల్‌లో సంబంధిత శాఖల అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
పిల్లలు బడిలో ఉండేలా చర్యలు తీసుకోవాలి
జిల్లాలో బాలబాలికలు విద్యకు దూరంగా కాకుండా బడిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట –2026 సమావేశాన్ని జిల్లాస్థాయి లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులతో శనివారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బడిబాట కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించాలన్నారు. డీఈఓ రంగయ్యనాయుడు పాల్గొన్నారు.
ఆర్‌ఓఎఫ్‌ఆర్ ల్యాండ్‌పై సమీక్ష
అటవీశాఖ ల్యాండ్స్ (రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్)పై సంబంధిత అధికారులతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్యశారద, డీఎఫ్‌ఓ నిఖిత కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. హౌసింగ్, నీటి పారుదల, విద్యుత్ శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేష్, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, వరంగల్ ఆర్డీఓ సుమ, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, డీసీఓ నీరజ, అధికారులు పాల్గొన్నారు.
వరంగల్‌కు మంత్రి కొండా సురేఖ..
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) సందర్భంగా జిల్లాల్లో జాతీయ పతాకావిష్కరణకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రముఖులను నియమించింది. హనుమకొండకు రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్‌కు అటవీ, పర్యావరణం, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖను కేటాయించింది.


