హనుమకొండ అర్బన్: జిల్లాలో జూన్ 15 నాటికి ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని బూత్ లెవెల్ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. జిల్లాలో ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడంపై తహసీల్దార్లు, బీఎల్‌ఓ, సూపర్‌వైజర్లతో శుక్రవారం కలెక్టరేట్‌లో ఆమె సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్‌ఓ శ్రీనివాస్, హనుమకొండ, పరకాల ఆర్డీఓ లు వెంకటేశ్, డీఎస్. వెంకన్న, తహసీల్దార్లు, బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
బహిరంగంగా పొగ తాగితే చర్యలు
బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం (ఏటీసీపీ)లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ పొగాకు నియంత్రణ చట్టం (కోట్పా యాక్ట్) జిల్లా కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 31న నిర్వహించే ప్రపంచ పొగాకు నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎ.అప్పయ్య జిల్లాలో చేపడుతున్న పొగాకు నియంత్రణ కార్యక్రమాలను వెల్లడించారు. సమావేశంలో ప్రముఖ గుండె వైద్య నిపుణుడు, శ్రీనివాస హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ రామకృష్ణ శ్రీనివాస్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి మేన శ్రీను, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, జీడబ్ల్యూఎంసీ సీహెచ్‌ఓ రాజారెడ్డి, డీఐఈఓ గోపాల్, ఏసీడీ ప్రోగ్రామ్ అధికారి శ్రీనివాస్, డీటీఓ వేణుగోపాల్, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ సునీత, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
‘ఎస్‌ఐఆర్’ హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు
ఎస్‌ఐఆర్–26 ప్రక్రియకు సంబంధించిన సమాచారం, సవరణలు, సహాయం కోసం హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి హెల్ప్‌డెస్క్ ఉంటుందని తెలిపారు. టోల్‌ఫ్రీ 1800–425–1126 /9701777182 అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అలాగే వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో ఆయా మండలాల ఆర్డీఓ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలతో పాటు మున్సిపల్ సర్కిల్ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
అధికారులతో సమీక్ష


