పని వేళలు పొడిగింపు
కాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. భూమి విలువలు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం సూచించిన మార్కెట్ వ్యాల్యూ, మార్కెట్‌లో భూమి విలువను పోలుస్తూ 25 శాతం నుంచి వందశాతం ప్లాట్లకు, వ్యవసాయానికి మూడింతలు పెంచేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్లు మార్కెట్ వ్యాల్యూను అనుసంధానం చేస్తున్నారు. జూన్ రెండో వారంలో పెంచిన మార్కెట్ వ్యాల్యూ ఆచరణలోకి రానున్నట్లు సమచారం.
నాలుగేళ్ల తర్వాత పెంపు
రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో దస్తావేజుల రిజిస్ట్రేషన్‌కు 1 ఫ్రిబవరి 2022 రిజిస్ట్రేషన్ ఫీజు 0.5, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ 1.5 స్టాంప్స్ డ్యూటీ 4.5 నుంచి 7.5 స్టాంప్స్ డ్యూటీగా పెంచారు. కాగా, 2024లో ప్రభుత్వం మార్కెట్ విలువలను పెంచేందుకు ప్రతిపాదించినప్పటికీ ధరలు పెరగలేదు. నా లుగేళ్ల తర్వాత భూమి మార్కెట్ విలువలను పెంచేందుకు జీఓ నంబర్ 101ను మే 5న విడుదల చేసి, 2024న ప్రతిపాదించిన మార్కెట్ వ్యాల్యూతో పెంచాలని సూచించింది. దీంతో భూమి మార్కెట్ విలువ 7.5 నుంచి 8.5 వరకు స్టాంప్స్ డ్యూటీ, మ్యూటేషన్ ఫీజు 3 వేల నుంచి 4 వేలకు పెరిగే అవకాశం ఉంది. దీంతో క్రయవిక్రయదారులకు పెంచిన మార్కెట్ విలువతో భారం పడనుంది.
భూముల విలువ ఇలా..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిల్ల పల్లిలో అత్యల్పంగా 600 మార్కెట్ వ్యాల్యూ ఉండగా, వందశాతం పెంచితే 1,200 అవుతుంది. అత్యధికంగా హనుమకొండ చౌరస్తాలో రూ.46 వేలు ఉండగా 70 నుంచి 85 శాతం పెరిగే అవకాశం ఉంది. అపార్ట్‌మెంట్లకు స్క్వేర్ ఫీట్‌కు రూ.2,300 ఉండగా రూ.3 వేలు అయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ భూములు మూడింతలు పెంచితే ప్రస్తుతం రూ.1.35 కోట్లు విలువ ఉండగా.. రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లు వరకు పెరిగే అవకాశం ఉంది.
భారం తగ్గించుకునేందుకు..
పెరగనున్న మార్కెట్ వ్యాల్యూతో భారం పడుతుందని, తగ్గించుకునేందుకు ముందే రిజిస్ట్రేషన్లు చేసుకుందామని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు భూక్రయవిక్రయదారులకు పోటెత్తుతున్నారు. వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో110 స్లాట్లు ప్రతీ రోజు అందుబాటులో ఉండగా.. సాధారణంగా 60 నుంచి 80 దస్తావేజులు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటున్నాయి. వారం రోజుల వ్యవధిలో 605 రిజిస్ట్రేషన్ల దస్తావేజులు పూర్తి చేసుకున్నాయి.
తేదీ రిజిస్ట్రేషన్లు
మే 21 105
22 100
23 107
25 92
26 93
27 108
మార్కెట్ వ్యాల్యూ సవరణలో భాగంగా రిజిస్ట్రేషన్లకు ఇబ్బందులు తలెత్తకుండా కార్యాలయాల పని వేళలు పొడిగిస్తున్నట్లు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హన్మంతు ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణంగా ఉదయం 10.30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు శుక్రవారం నుంచి జూన్ 3వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి రాత్రి 7.30 వరకు కొనసాగనున్నట్లు తెలిపారు. ప్రతీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి 48 స్లాట్లు, ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు అందుబాటులో ఉంటే 98తో పాటు మరో 10 స్లాట్లు అందుబాటులో ఉండగా.. రిజిస్ట్రేషన్ల అవసరం నిమిత్తం స్లాట్స్ మ రింత పెంచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
జూన్ రెండో వారంలో భూమి విలువ పెంపు
ఆదాయం పెంచుకునే
యోచనలో సర్కారు
రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పోటెత్తుతున్న భూ క్రయవిక్రయదారులు


