వరంగల్ క్రైం: బక్రీద్ పండుగను పురస్కరించుకుని హనుమకొండలోని బొక్కలగడ్డ ఈద్గాను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ గురువారం సందర్శించి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం ప్రార్థనలు సజావుగా జరిగేందుకు అధికారులు చేపట్టిన చర్యలపై సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, హనుమకొండ నర్సింహారావు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
కాజీపేట: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు పసునూరి నరహరి, దానమ్మ దంపతులు పుట్టిన గడ్డపై నాలుగున్నర దశాబ్దాల తర్వాత అడుగుపెట్టారు. గురువారం రాత్రి సోమిడికి వచ్చిన ఆ దంపతులకు గ్రామస్తులు, బంధుమిత్రులు కాజీపేట చౌరస్తాలో ఘన స్వాగతం పలికారు. సన్మానించి అభినందనలు తెలిపారు. కాజీపేట వాటర్ ట్యాంక్ నుంచి భారీ ఊరేగింపుగా నరహరి దంపతులను సోమిడి గ్రామానికి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులను చూసిన నరహరి భావోద్వేగానికి గురయ్యారు. ఈసందర్భంగా పాత కాలం నాటి జ్ఞాపకాలను ఆనాటి మిత్రులతో నరహరి పంచుకున్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు బి.వెంటేశ్, మాజీ కార్పొరేటర్ గుంటి కుమారస్వామి, సుంచు అశోక్, బస్వా యాదగిరితో పాటు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
హెల్త్‌కార్డుల మార్గదర్శకాలు విడుదల చేయాలి
కాళోజీ సెంటర్: హెల్త్‌కార్డుల మార్గదర్శకాలు విడుదల చేయాలని, కార్డుల ద్వారా అందించే సేవలపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్లాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి డిమాండ్ చేశారు. డీటీఎఫ్ వరంగల్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు డి.మహేందర్‌రెడ్డి అధ్యక్షతన గురువారం నగరంలో జరిగింది. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ కార్డుల ద్వారా అందించే సేవలపై సందేహాలు నెలకొన్నాయని, హడావుడిగా అమలు చేసి ఉద్యోగుల నుంచి చందా తీసుకోవద్దని కోరారు. ఉపాధ్యాయులు జనగణనలో ఉన్నందున సర్వీస్ వివరాలను ఐఎఫ్‌ఎంఎస్‌లో పొందుపర్చడానికి గడువు పొడిగించాలని పేర్కొన్నారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎ.శ్రీనివాస్ మాట్లాడుతూ హెల్త్‌కార్డులపై సేవలను పొందడం ఐచ్ఛికం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందరావు, సభ్యులు ఎస్.సుధారాణి, డి.కుమారస్వామి, టి.సూరయ్య, టి.ఆనందచారి, నర్సింహులు, ఆర్.రాంరెడ్డి, డి.శ్రీనివాస్, ఫ్రాన్సిస్ జేవియర్ పాల్గొన్నారు.


