విద్యారణ్యపురి/కాళోజీ సెంటర్: ప్రభుత్వ యాజమాన్యాల పరిధి పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం (2026–2027) జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం రోజు నుంచే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందజేయనున్నారు. ఇప్పటికే 1 నుంచి 10వ తరగతి వరకు ఎక్కువశాతం టైటిల్ పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయి. కొన్ని టైటిల్ పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. నోట్‌బుక్స్‌తోపాటు ఈసారి వర్క్‌బుక్స్‌ను కూడా విద్యార్థులకు ఇవ్వనున్నారు. నోట్‌బుక్స్, వర్క్ బుక్స్ రావాల్సి ఉంది. అయితే వీటిని నేరుగా మండల కేంద్రాలకే పంపిణీ చేయనున్నట్లు సమాచారం.
హనుమకొండ జిల్లాలో..
హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలలకు 2,56,180 పుస్తకాలు రావాల్సి ఉండగా హైదరాబాద్ నుంచి హనుమకొండ జిల్లా కేంద్రంలోని గోదాంకు ఇప్పటి వరకు 2,29,980 పాఠ్యపుస్తకాలు (89.73శాతం) చేరుకున్నాయి. ఇంకా 26,300 రావాల్సింది. జిల్లాలోని 14 మండలాల్లోని ఎంఈఓలు తమ మండలాల్లోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తీసుకెళ్లాలని, అందుకయ్యే రవాణా వ్యయం తర్వాత అందజేస్తామని డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్ గౌడ్ ఆదేశించారు. అంతేకాకుండా గత శనివారంనుంచి మండల కేంద్రాలకు పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. ఎంఈఓలు తమ ఎంఆర్‌సీ కేంద్రాలకు తరలించాక అక్కడినుంచి హెచ్‌ఎంలు ఆయా స్కూల్ పాయింట్లకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. జూన్ 12లోగానే ఈ ప్రక్రియ పూర్తి కావాలి.
వరంగల్ జిల్లాలో..
వరంగల్ జిల్లాలోని 13 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 36,839 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలోని విద్యార్థులకు మొత్తం 2,35,750 (పార్ట్–1) పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంది. అందులో ఇప్పటికే 1,98,430 పుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. ఇంకా 37,320 పుస్తకాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.
తగ్గనున్న బ్యాగు భారం..
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ‘ద్విభాషా విధానం’(ఒకవైపు తెలుగు, మరోవైపు ఇంగ్లిష్) ప్రవేశపెట్టారు. ఈ ఏడాది కూడా 1 నుంచి 10వ తరగతి వరకు పూర్తిస్థాయిలో ఈ విధానం అందుబాటులో ఉంటుంది. ద్విభాషా పుస్తకాల ముద్రణతో విద్యార్థులకు బ్యాగుల భారం తగ్గనుంది.
హనుమకొండ జిల్లా గోదాంకు చేరిన 89.73 శాతం పుస్తకాలు
వరంగల్ జిల్లా గోదాంకు 1,98,430 పుస్తకాలు..
జిల్లా కేంద్రం నుంచి
మండల కేంద్రాలకు..
ఆయా పాఠశాలలకు పంపిణీ
ప్రక్రియ షురూ..


