రెవెన్యూ ఆఫీసర్స్‌ | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ ఆఫీసర్స్‌

May 29 2026 8:04 AM | Updated on May 29 2026 8:04 AM

సాక్షిప్రతినిధి, వరంగల్‌: వేగంగా విస్తరిస్తున్న పట్టణాలు.. పెరుగుతున్న జనాభాతో రెవెన్యూ కార్యాలయాల్లో ఫైళ్లు పేరుకుపోతున్నాయి. ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాల కోసం ప్రజలకు నిరీక్షణ తప్పట్లేదు. వీటితో పాటు భూ వివాదాలు, భూ భారతి దరఖాస్తులతో మండల కార్యాలయాలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణ మండలాల్లో అదనపు తహసీల్దార్‌ పోస్టులను సృష్టిస్తూ సీఎస్‌ఎల్‌ఏ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరంగల్‌, ఖిలా వరంగల్‌, కాజీపేట, హనుమకొండ, హసన్‌పర్తి, మహబూబాబాద్‌ మండలాలకు కొత్త పోస్టులు మంజూరయ్యాయి. ప్రత్యేకంగా వరంగల్‌–హనుమకొండ నగర పరిసర ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ విస్తరణ, భూ లావాదేవీలు పెరగడంతో రెవెన్యూ శాఖపై ఒత్తిడి మరింత అధికమైంది. ఈ పరిస్థితుల్లో ప్రజలకు త్వరితగతిన సేవలందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అదనపు తహసీల్దార్‌ పోస్టులు సృష్టించింది. దీంతో పట్టణ ప్రాంతాల్లో రెవెన్యూ సేవలు వేగవంతం కానున్నాయని అధికారులు భావిస్తున్నారు.

కొత్త పోస్టులు ఎక్కడెక్కడంటే..

నాయబ్‌ తహసీల్దార్లను అదనపు తహసీల్దార్లుగా జిల్లాలకు కేటాయించిన ప్రభుత్వం.. వారిని సంబంధిత మండలాల్లో నియమించాలని కలెక్టర్లను ఆదేశించింది. హనుమకొండ జిల్లాకు మహబూబాబాద్‌, వరంగల్‌, భద్రాద్రి కొత్తగూడెంలో నాయబ్‌ తహసీల్దార్లుగా పని చేస్తున్న ఆకుల రవి, గడ్డం రమేశ్‌, ఎంఎస్‌ గౌతమ్‌ను కేటాయించారు. హనుమకొండ జిల్లాలో నాయబ్‌ తహసీల్దార్లుగా ఉన్న ఎల్‌.భాస్కర మూర్తి, ఎండీ యూసుఫ్‌ ఖురేషీలను వరంగల్‌ జిల్లాకు, హనుమకొండ జిల్లాలోనే నాయబ్‌ తహసీల్దారుగా ఉన్న ఎం.రంజిత్‌కుమార్‌ను మహబూబాబాద్‌ జిల్లాకు కేటాయించారు. అలాగే హనుమకొండ జిల్లాలో నాయబ్‌ తహసీల్దార్లుగా పని చేస్తున్న దుర్శెట్టి శ్రీధర్‌, వి.శైలజను పెద్దపల్లికి, వరంగల్‌లో ఉన్న ఎస్‌.రాజరేణుకను ఖమ్మం, ఐ.పవన్‌కుమార్‌ను భద్రాద్రి కొత్తగూడేనికి బదిలీ చేశారు.

ఒత్తిడి తగ్గేనా?

పట్టణ మండలాల్లో రోజుకు వందల సంఖ్యలో ప్రజలు వివిధ అవసరాల కోసం తహసీల్దార్‌ కార్యాలయాలను ఆశ్రయిస్తున్నారు. ఒకే అధికారిపై అధిక భారం ఉండడంతో ప్రజలు రోజుల తరబడి తిరగాల్సి వస్తోందనే విమర్శలున్నాయి. కొత్త పోస్టులతో ఫైళ్ల క్లియరెన్స్‌ వేగవంతం కావడంతో పాటు రెవెన్యూ ఉద్యోగులపై ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న రెవెన్యూ సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కీలకంగా మారనుందని రెవెన్యూ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అదనపు తహసీల్దార్‌ బాధ్యతలు

ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాల జారీ

సహజ విపత్తుల సహాయక చర్యలు

రెవెన్యూ రికవరీ కేసుల పర్యవేక్షణ

భూ ఆక్రమణల తొలగింపు

రైస్‌ మిల్లులు, ఫెయిర్‌ ప్రైస్‌ షాపుల తనిఖీలు

ఎన్నికల నిర్వహణలో సహకారం

తహసీల్దార్‌ బాధ్యతలు

భూ భారతి రిజిస్ట్రేషన్లు

భూ కేటాయింపులు

లా అండ్‌ ఆర్డర్‌ విధులు

ఎన్నికల నిర్వహణ

పౌర సరఫరాల పర్యవేక్షణ

రేషన్‌ కార్డుల వ్యవహారాలు

పట్టణ మండలాలకు

అదనపు తహసీల్దార్ల నియామకం

ఉత్తర్వులు జారీ చేసిన సీసీఎల్‌ఏ

లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాలకు కేటాయింపు

మూడు జిల్లాల్లో ఆరు మండలాలకు కొత్త పోస్టులు

భూ భారతి నుంచి ధ్రువపత్రాల

సేవలకు వినియోగం

Advertisement
 
Advertisement
Advertisement