సాక్షి, వరంగల్: బాల్య వివాహాలను క్షేత్రస్థాయిలో కట్టడి చేసేందుకు వరంగల్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (డీసీపీయూ) సరికొత్త పంథాతో ముందుకెళ్తోంది. విలేజ్ లెవల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీల నియామకాలు ఓవైపు చేపడుతూనే.. మరోవైపు సర్పంచ్‌ల నుంచి డిక్లరేషన్ తీసుకుంటూ బాల్యవివాహాలను పూర్తిస్థాయిలో నియంత్రించే దిశగా అడుగులు వేస్తోంది. కలెక్టర్ డాక్టర్ సత్యశారద మార్గదర్శనంలో జిల్లా సంక్షేమ విభాగాధికారి, ఇన్‌చార్జ్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పర్వతగిరి, నెక్కొండ, ఖానాపురం మండలాల్లో ఇప్పటివరకు 50 మంది సర్పంచ్‌ల నుంచి డిక్లరేషన్ తీసుకున్నారు. మిగిలిన గ్రామసర్పంచ్‌ల నుంచి కూడా సాధ్యమైనంత తొందరగా తీసుకోనున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో బాల్యవివాహాలు కాకుండా ఉండేందుకు సర్పంచ్‌లనే బాధ్యులనే చేయడం ద్వారా ‘జీరో చైల్డ్ మ్యారేజ్’ చేయాలని ముందుకెళ్తున్నారు. చాలా బాల్యవివాహాల సమాచారం అందిన సందర్భాల్లో ఆ ఊరి పెద్దలు, కొందరు సర్పంచ్‌ల ప్రమేయం ఉందని తెలియడంతో.. వారికే బాధ్యత ఇవ్వడం ద్వారా బాల్యవివాహ రహిత గ్రామాలుగా మార్చవచ్చని డీసీపీయూ విభాగాధికారులు అంచనా వేస్తున్నారు.
డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ నియామకం
దిశగా అడుగులు...
జిల్లాలో 392 వీసీపీసీ (విలేజ్ లెవల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ)లు, అర్బన్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఇప్పటికే 214 వీసీపీసీలు, ఐదు మండలాల (గీసుకొండ, నర్సంపేట, దుగ్గొండి, సంగెం, ఖానాపురం)కు బాలల పరిరక్షణ కమిటీలను నియమించింది. అలాగే, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ నియామకం కోసం ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఇంకోవైపు గ్రామస్థాయిలో కార్యదర్శి, సెక్టార్ లెవల్‌లో ఐసీడీఎస్ సూపర్‌వైజర్, మండలస్థాయిలో తహసీల్దార్, ప్రాజెక్టు లెవల్‌లో సీడీపీఓలు, డిజినల్ స్థాయిలో ఆర్డీఓలు, జిల్లా స్థాయిలో కలెక్టర్ ‘చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్’గా వ్యవహరిస్తారు. బాల్యవివాహం ఘటనపై అంగన్‌వాడీ సూపర్‌వైజర్లే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.
జీరో చైల్డ్ మ్యారేజ్ కోసం సర్పంచ్‌ల నుంచి డీసీపీయూ డిక్లరేషన్
మూడు మండలాల్లో ఇప్పటికే 50
మంది నుంచి లిఖితపూర్వక హామీలు
కలెక్టర్ సత్యశారద పర్యవేక్షణలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ముందుకు..
స్నేహ గ్రూపులను జాగృతం చేసే దిశగా..
పాఠశాలల స్థాయిలో ఉన్న స్నేహ గ్రూపులను జాగృతం చేసే దిశగా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు జిల్లా బాలల సంరక్షణ విభాగాధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ తెలంగాణ’ (బాల్యవివాహం...బతుకు ఆగం ట్యాగ్‌లైన్)తో బాల్యవివాహం నిరోధక చట్టం–2016పైనే కలెక్టర్‌తో సహా సంబంధిత అధికారులు అవగాహన కల్పించారు. 2025 నుంచి ఇప్పటివరకు 35 బాల్యవివాహాల కేసులు నమోదయ్యాయి. సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ డాక్టర్ సత్యశారద బాల్య వివాహాలను పూర్తిగా కట్టడి చేసే దిశగా ముందుకెళ్తున్నారు. బాల్యవివాహ నిషేధ చట్టం 2016 ప్రకారం.. 18 ఏళ్లలోపు అమ్మాయి, 21 ఏళ్లలోపు అబ్బాయికి పెళ్లి చేయడం నేరం. తల్లిదండ్రులు, బంధువులు, మధ్యవర్తులు, పురోహితులు...ఇలా ఎవరైనా సరే బాల్యవివాహం జరిపించిన వారికి రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో రెండు విధించే అవకాశం ఉంటుంది. చిన్న వయస్సులో పెళ్లి ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది’ అని స్నేహ గ్రూపులను జాగృతం చేయనున్నారు.


