కాళోజీ సెంటర్: హెల్త్‌కార్డుల మార్గదర్శకాలు విడుదల చేయాలని, కార్డుల ద్వారా అందించే సేవలపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్లాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి డిమాండ్ చేశారు. డీటీఎఫ్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు డి.మహేందర్‌రెడ్డి అధ్యక్షతన గురువారం నగరంలో జరిగింది. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ కార్డుల ద్వారా అందించే సేవలపై సందేహాలు నెలకొన్నాయని, హడావుడిగా అమలు చేసి ఉద్యోగుల నుంచి చందా తీసుకోవద్దని కోరారు. ఉపాధ్యాయులు జనగణనలో ఉన్నందున సర్వీస్ వివరాలను ఐఎఫ్‌ఎంఎస్‌లో పొందుపరచడానికి గడువు పొడగించాలని పేర్కొన్నారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎ.శ్రీనివాస్ మాట్లాడుతూ హెల్త్‌కార్డులపై సేవలను పొందడం ఐశ్చికం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందరావు, సభ్యులు ఎస్.సుధారాణి, డి.కుమారస్వామి,టి.సూరయ్య, టి.ఆనందచారి, నర్సింహులు, ఆర్.రాంరెడ్డి, డి.శ్రీనివాస్, ఫ్రాన్సిస్ జేవియర్ పాల్గొన్నారు.
పారదర్శకంగా
కార్యదర్శుల బదిలీ
పర్వతగిరి: జీఓ 38 ప్రకారం పంచాయతీ కార్యదర్శుల సాధారణ బదిలీలు పూర్తిగా పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా చేపట్టినట్లు జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు జి.యాకూబ్‌నాయక్, డి.కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి డి.సదానందం, బి.మధు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు వాస్తవాలకు విరుద్ధమని, బదిలీల ప్రక్రియ మొత్తం జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో నిష్పక్షపాతంగా నిర్వహించినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శుల సమస్యలను సానుభూతితో పరిశీలించి కౌన్సెలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించినందుకు కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈఓ, డీపీఓకు కృతజ్ఞతలు తెలిపారు. డిప్యుటేషన్‌పై వెళ్లిన పంచాయతీ కార్యదర్శులు వారు కోరుకున్న స్థానాలకు కేటా యించే దిశగా అధికారులు సానుకూల నిర్ణ యం తీసుకోవడంతో హర్షం వ్యక్తం చేశారు.
త్వరలో ఇంటర్‌సిటీ
రైళ్ల తయారీ
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (కోచ్ ఫ్యాక్టరీ)పై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం కీలక ప్రకటన చేసినట్లు కాజీపేట రైల్వే అధికారులు తెలిపారు. ఢిల్లీలో రైల్వే మంత్రి అధికారులు, మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం. కాజీపేట రైల్వే యూనిట్ నిర్మాణం పూర్తి కావొచ్చిందని, యూనిట్‌లో త్వరలో ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. రానున్న ఐదేళ్లలో 200 ఇంటర్‌సిటీ రైళ్లు కాజీపేట యూనిట్ నుంచి తయారు చేయనున్నట్లు తెలిపారు. కాజీపేట మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌పై కేంద్ర సహాయ మంత్రి రవనీత్‌సింగ్ బిట్టు, సీనియర్ ఆఫీసర్లతో కలిసి రైల్వే మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.


