పచ్చిరొట్ట.. పంటల దిగుబడిలో దిట్ట | - | Sakshi
Sakshi News home page

పచ్చిరొట్ట.. పంటల దిగుబడిలో దిట్ట

May 29 2026 8:04 AM | Updated on May 29 2026 8:04 AM

పచ్చిరొట్ట.. పంటల దిగుబడిలో దిట్ట

ఖిలా వరంగల్‌ : పంటల సాగులో రసాయన ఎరువులు వాడితే రైతులకు పెట్టుబడి ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. భూసారం కూడా తగ్గుతోంది. దీనికి పచ్చిరొట్ట ఎరువు ఒక్కటే ప్రత్యామ్నాయమని వ్యవసాయాధికారులు తెలిపారు. పచ్చిరొట్టతో బహుళ ప్రయోజనాలు ఉంటాయని వారు పేర్కొంటున్నారు. గతేడాది జిల్లాలో 4 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేయగా.. ఈసారి 3,500 క్వింటాళ్ల విత్తనాలను అధికారులు రైతులకు పంపిణీ చేస్తున్నారు.

పచ్చిరొట్ట, పచ్చిఆకు ఎరువులు..

నేలకు సత్తువ పెంచే వాటిని పచ్చిరొట్ట ఎరువులు అంటారు. వీటిలో జీలుగ, జనుము, అలసంద, పిల్లి పెసర, అవిశ, వెంపలి ముఖ్యమైనవి. పచ్చి రొట్ట పైరు పెంచడానికి వీలులేనప్పుడు, ప్రధాన పంటలు వేయడానికి మధ్యలో వ్యవధి తక్కువగా ఉన్నప్పుడు పచ్చిరొట్ట పైరు ఆకులు సేకరించి పొలంలో వేసి ఎరువుగా ఉపయోగించాలి. గానుగ, నేల తంగేడు, జిల్లేడు, తూటాకు తదితర చెట్ల ఆకులు పచ్చిఆకు ఎరువుకు అనుకూలమైనవి.

పచ్చిరొట్ట సాగు సూచనలు..

విత్తన మోతాదు ఎకరాకు జనుము 20 నుంచి 25 కిలోలు, పిల్లి పెసర 5 నుంచి 6 కిలోలు, జీలుగ 12 నుంచి 15 కిలోలు, పెసర, మినుములు 6 నుంచి 8 కిలోలు అవసరమవుతాయి. తొలకరి వర్షాలు ప్రారంభమైనప్పుడు ఖరీఫ్‌ సీజన్‌కు ముందుగా పచ్చిరొట్ట విత్తనాలు వేసుకోవచ్చు. నత్రజని వృథాగా పోకుండా ఉండడానికి కనీసం 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతులో నీరు చేరిన వెంటనే కాలయాపన లేకుండా కలియదున్నాలి.

ప్రయోజనాలు ఇలా..

ప్రధానంగా భూసార పరిరక్షణకు తోడ్పడతాయి. నేలలోని హ్యూమన్‌ పదార్థం వృద్ధి చెంది పోషకాల వృథాను అరికడుతుంది. నేలగుల్ల బారేలా చేసి, గాలి ప్రసరణ, మురుగు నీటి వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పచ్చిరొట్ట ఎరువు భూమిలో కుళ్లినప్పుడు రసాయన ప్రక్రియ జరిగి పోషక పదార్థాలు అందుబాటులోకి వస్తాయి. పచ్చిరొట్ట ఎరువులో సేంద్రియ పదార్థం ఉంటుంది. దీంతో సూక్ష్మ పోషకాలు విస్తారంగా వృద్ధి చెందుతాయి. చౌడునేలను నివారిస్తాయి. పచ్చిరొట్ట ఎరువు వేసి పండించిన పంటలో దిగుబడి 15 నుంచి 20 శాతం అధికంగా ఉంటుంది.

30 శాతం రైతులు పచ్చిరొట్ట సాగుపై ఆసక్తి..

ప్రభుత్వం జీలుగ విత్తనాలను 50 శాతం రాయితీపై అందిస్తోంది. 30 కిలోల బస్తా ధర రూ.4,905.. రాయితీ 50 శాతం పోను బస్తా ధర రూ.2,452గా నిర్ణయించారు. ఈసారి జిల్లాలో 1,25,000 ఎకరాల్లో వరిని పండించనున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో 30 శాతం రైతులు పచ్చిరొట్ట ఎరువులు వేసుకునేందుకు ఆసక్తి చూపుతారు. వరి నాటుకు 45 రోజుల ముందుగా వేస్తే పంట ఏపుగా పెరుగుతుంది. పొలం కలియ దున్నితే కంపోస్టు ఎరువుగా మారుతుంది.

మండలాల వారీగా అందుబాటులో ఉన్న

జీలుగ విత్తనాలు ((క్వింటాళ్లలో)

పెరగనున్న భూసారం.. తగ్గనున్న పెట్టుబడి

జిల్లాలో 3,500 క్వింటాళ్ల

రాయితీ విత్తనాలు

ఈసారి 1.25 లక్షల ఎకరాల్లో

వరి సాగు అంచనా

మండలాలు జీలుగ విత్తనాలు

చెన్నారావుపేట 150

దుగ్గొండి 250

గీసుకొండ 120

ఖానాపురం 150

ఖిలా వరంగల్‌ 80

నల్లబెల్లి 200

నర్సంపేట 150

నెక్కొండ 380

వరంగల్‌ 20

పర్వతగిరి 550

రాయపర్తి 550

సంగెం 200

వర్ధన్నపేట 700

Advertisement
 
Advertisement
Advertisement