రక్షణకు ప్రత్యేక శ్రద్ధ
● వేసవిలో నర్సరీల సంరక్షణకు చర్యలు
నెక్కొండ : పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణలో భాగంగా అన్ని గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎండలు మండుతుండటంతో వన సంరక్షణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. చలువ పందిళ్లు (గ్రీన్ నెట్) వేసి నర్సరీలోని మొక్కలకు ప్రాణవాయువును అందిస్తోంది. కాగా మొక్కలు ఎదిగిన అనంతరం వర్షాలు కురిశాక ఏటా వనమహోత్సవం పేరిట రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, ఖాళీ స్థలాల్లో ఉపాధి హామీ కూలీలతో మొక్కలు నాటిస్తారు. ఇళ్ల ఆవరణల్లో, వ్యవసాయ బావుల వద్ద పచ్చదనం పెంచాలని సూచిస్తూ ప్రజలకు పలు రకాల మొక్కలు పంపిణీ చేస్తోంది. ఎండల నేపథ్యంలో నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను సంరక్షించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నర్సరీల్లో గ్రీన్ నెట్ ఏర్పాటు చేస్తున్నారు. వాటి నీటితో తడుపుతూ ఉదయం, సాయంత్రం వేళల్లో నీరు అందిస్తూ మొక్కలను రక్షిస్తున్నారు.
39 నర్సరీలు.. 2.70 లక్షల మొక్కలు
మండలంలోని మొత్తం 39 గ్రామ పంచాయతీల్లో అధికారులు ఉపాధి హామీ పథకం కింద నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. గతేడాది సుమారు 2.50 లక్షల మొక్కలు పెంచారు. ఈసారి వర్షాలు మొదలవగానే వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా 2.70 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు, సిబ్బంది సిద్ధమవుతున్నారు. ఆ దిశగా జిల్లాస్థాయి నుంచి మొదలుకొని మండల స్థాయి వరకు ఉన్న అధికారులు, సిబ్బంది మొక్కల సంరక్షణ చర్యల్లో క్రియాశీలకంగా భాగస్వాములవుతున్నారు.
నర్సరీల్లోని మొక్కల రక్షణకు శద్ధ తీసుకుంటున్నాం. ఎండ తీవ్రత నేపథ్యంలో గ్రీన్ నెట్ ఏర్పాటు చేశాం. మొక్కలకు నీడ కల్పిస్తున్నాం. నర్సరీల్లోని అన్ని మొక్కలను కాపాడతాం.
– యాసం లావణ్య, ఎంపీడీఓ


