దరఖాస్తుదారుల సందడి | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుదారుల సందడి

May 28 2026 12:40 AM | Updated on May 28 2026 12:40 AM

ఖానాపురం : పెన్షన్‌ల కోసం గ్రామీణ ప్రాంత ప్రజలు పరుగులు మొదలు పెట్టారు. ఏళ్ల తరబడి నుంచి పెన్షన్ల మంజూరీ లేకపోవడంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేస్తుందని దరఖాస్తులు చేసుకోవడానికి ఆన్‌లైన్‌సెంటర్లు మీసేవ కేంద్రాల వద్దకు పరుగులు పెడుతున్నారు. కావాల్సిన ధ్రువీకరణ పత్రాల కోసం కుస్తీలు పడుతున్నారు. మండల వ్యాప్తంగా 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామాల పరిధిలో దివ్యాంగ, వితంతు, వృద్ధాప్యతో పాటు పలు రకాల పెన్షన్లు 5025 మంది పెన్షన్‌ తీసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాం నుంచి నూతన పింఛన్ల మంజూరీ ఆగిపోయింది. దీంతో నాటి నుంచి అనేక మంది వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, ఒంటరి మ హిళలతో పాటు గౌడ కులస్తులకు పింఛన్‌ల కోసం చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇందుకోసం అర్హులైన ప్రజలు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది. దీంతో అనేక సంవత్సరాలుగా నూతన పింఛన్‌ల కోసం ఎదురుచూపులు చూస్తున్న వారిలో ఆశలు రేకెత్తాయి. దరఖాస్తు చేసుకునే సమయంలో కావాల్సిన పత్రాల కోసం మీసేవ కేంద్రాలు, తహసీల్దార్‌ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇతర పత్రాల కోసం అధికారుల వద్దకు చేరుతున్నారు. దీంతో గ్రామాల్లో పింఛన్‌ల సందడి నెలకొంది.

దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు

పింఛన్‌ల కోసం దరఖాస్తు చేసుకునే వారు పలు పత్రాలను అందజేయాల్సి ఉంటుంది. వృద్ధాప్యకు ఆధార్‌, ఓటరు, రేషన్‌కార్డులు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంక్‌ పాస్‌బుక్‌, వితంతుకు భర్త మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు గుర్తింపు కార్డులు, బీడీ కార్మికులకు కార్మిక గుర్తింపు కార్డు, దివ్యాంగులకు యూడీఐడీ, 40 శాతానికి పైగా కలిగిన సదరం సర్టిఫికెట్లను తప్పకుండా కలిగి ఉండాలి. సంబంధిత పత్రాలతో దరఖాస్తులను ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అర్హులను అధికారులు గుర్తించనున్నారు.

మీ సేవల వద్ద బారులు

తహసీల్దార్‌ కార్యాలయానికి పరుగులు

ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేస్తుందని ఆశలు

Advertisement
 
Advertisement
Advertisement