కొత్త బాస్‌.. కొత్త రూల్స్‌! | - | Sakshi
Sakshi News home page

కొత్త బాస్‌.. కొత్త రూల్స్‌!

May 28 2026 12:28 AM | Updated on May 28 2026 12:28 AM

కొత్త బాస్‌.. కొత్త రూల్స్‌!

హన్మకొండ చౌరస్తా: విజయ డెయిరీ వరంగల్‌ మిల్క్‌షెడ్డుకు కొత్తగా వచ్చిన బాస్‌.. తనకు నచ్చిన రూల్స్‌ను అమలు చేయడానికి తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణలో ఏ జిల్లాలో అమలులో లేని నిబంధనలు కొత్తగా తెరమీదకు తీసుకురావడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. తనకు అనుకూలమైన రూల్స్‌ను రూపొందించిన సదరు బాస్‌.. డెయిరీ ఉన్నతాధికారులు, చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆ ఫైల్‌ కాస్త పెండింగ్‌లో ఉన్నట్లు డెయిరీలో చెప్పుకుంటున్నారు. విజయ డెయిరీ వరంగల్‌ మిల్క్‌షెడ్‌ పరిధిలోని ఆరు జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థలకు పాలు సరఫరా చేసేందుకు ఇటీవల డిస్ట్రిబ్యూటర్లను ఆహ్వానించారు. గతంలో విద్యా సంస్థలకు సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్లు రెండు రోజులు మహా అయితే వారం రోజులకు సంబందించిన పాల మొత్తాన్ని ముందుగా డెయిరీలో డిపాజిట్‌ చేసేవారు. అనంతరం ఏ రోజుకు ఆరోజు సరిపడా మొత్తాన్ని చెల్లించి పాలను తీసుకెళ్లేవారు.

కొత్త రూల్స్‌..

ఈ నెల 4న విజయ డెయిరీ వరంగల్‌ మిల్క్‌షెడ్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ధన్‌రాజ్‌, గతంలో ఉన్న నిబంధనలు పక్కనపెట్టి సరికొత్త రూల్స్‌ తీసుకొచ్చాడు. ప్రభుత్వ రంగ విద్యా సంస్థలకు పాలు సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్లు సుమారు 1 నుంచి 3 నెలల మొత్తాన్ని బ్యాంకు గ్యారంటీ ద్వారా డెయిరీకి బాండ్‌ ఇవ్వాలని మెలిక పెట్టారు. అంతేకాకుండా పాలు సరఫరా చేసే కేంద్రాల్లో డిస్ట్రిబ్యూటర్లే స్వయంగా కోల్డ్‌స్టోరేజీలను ఏర్పాటు చేసుకోవాలని, పాలు సరఫరా చేసేందుకు పఫ్‌ వాహనాలను ఉపయోగించాలని తాను కొత్తంగా రూపొందించిన రూల్స్‌ను డిస్టిబ్యూటర్ల ముందుంచారు. గతంలోనూ, ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్‌తో సహా ఏ ఇతర జిల్లాల్లో లేని కొత్త రూల్స్‌ను తెరమీదకు తీసుకురావడంతో డిస్టిబ్యూటర్లు ఒక్కసారిగా కంగుతిన్నారు.

వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ..

డెయిరీ డిస్టిబ్యూటర్లకు లీటరుకు రూ.55 అందిస్తోంది. రూ.7 లాభం కలుపుకుని రూ.62కు లీటర్‌ పాలను విద్యా సంస్థలకు అందజేస్తోంది. అందులో వాహన రవాణా చార్జీ, డ్రైవర్‌ జీత భత్యాలు, నిర్వహణ ఖర్చులు తీసేస్తే డిస్టిబ్యూటర్‌కు మిగిలేది అంతంతమాత్రమే. అతి తక్కువ కమీషన్‌తో సరఫరా చేసేందుకు ముందుకొచ్చిన తమకు లక్షల రూపాయల బ్యాంకు గ్యారంటీ ఎలా సాధ్యం అవుతుందని డిస్ట్రిబ్యూటర్లు ప్రశ్నిస్తున్నారు.

నోటిఫికేషన్‌ ఎందుకు ఇవ్వలేదు?

సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైనా అభివృద్ధి, ఇతర పనులను మూడో వ్యక్తికి అప్పగించేముందు బహిరంగంగా టెండర్లను ఆహ్వానించడం అందరికీ తెలిసిందే. అందుకు భిన్నంగా విజయ డెయిరీలో ప్రభుత్వ విద్యా సంస్థలకు పాలు సరఫరా చేసేందుకు డిస్ట్రిబ్యూటర్ల కోసం టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ ఇవ్వకపోవడం విశే షం. డెయిరీతో పరిచయం ఉన్న వ్యక్తులకు సమాచారం ద్వారా కొందరిని తన ఆఫీసుకు పిలిచి దరఖాస్తులను ఆహ్వానించడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు లేనివిధంగా కొత్త రూల్స్‌ తీసుకొస్తున్న డీడీ, బహిరంగంగా టెండర్లను ఎందుకు పిలవలేదని ప్రశ్నిస్తున్నారు.

నష్టం జరగొద్దనే బ్యాంకు గ్యారంటీ

గతంలో పాలు సరఫరా చేసిన డిస్ట్రిబ్యూటర్లు, డెయిరీకి ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించకుండా ఇబ్బందులు పెట్టారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే బ్యాంకు గ్యారంటీలను కోరుతున్నాం. గతంలో ఎప్పుడూ డిస్ట్రిబ్యూటర్ల కోసం టెండర్లను ఆహ్వానించలేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లను ఆఫీసుకు ఆహ్వానించి దరఖాస్తులను ఆహ్వానించాం. ఆ ఫైల్‌ ప్రస్తుతం డెయిరీ చైర్మన్‌, ఎండీల వద్ద ఉంది. వారు తీసుకున్న నిర్ణయం మేరకు డిస్ట్రిబ్యూటర్లను నియమించడం జరుగుతుంది.

– ధన్‌రాజ్‌, డిప్యూటీ డైరెక్టర్‌, వరంగల్‌ మిల్క్‌షెడ్‌

డిస్ట్రిబ్యూటర్లకు బ్యాంక్‌ గ్యారంటీ మెలిక

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిబంధనలు

విజయ డెయిరీ డీడీ తీరుపై విమర్శలు

Advertisement
 
Advertisement
Advertisement