● వరుసగా పట్టుబడుతున్న పేకాటరాయుళ్లు
● దృష్టిసారించని లోకల్ పోలీస్!
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పేకాట మూడు ముక్కలు.. ఆరు జోకర్ల మాదిరిగా విరజిల్లుతోంది. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చూసినా జోరుగా సాగుతోంది. స్థానిక పోలీసులకు చిక్కని పేకాటరాయుళ్లు కమిషనరేట్ కేంద్రంలో ఉండే టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుబడుతున్నారు. స్థానిక పోలీసులు నో ఇన్ఫర్మేషన్ పేరిట చేతులు దులుపుకుంటున్నారు. ఇటీవల ట్రైసీటి పరిధిలో పట్టుబడిన పేకాట రాయుళ్లు వివిధ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చిన వారే. విలాసవంతమైన హోటళ్లను బుక్ చేసుకుని పేకాడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా వీఐపీలు నివాసించే కాలనీల్లో పేకాడుతూ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
విజిబుల్ పోలీసింగ్ ఎక్కడ?
ప్రతిసారి పేకాట రాయుళ్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు మాత్రమే చిక్కుతున్నారు. లోకల్ పోలీస్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై దృష్టిసారించడం లేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ప్రజల మధ్య విజి బుల్ పోలీసింగ్ చేస్తున్న బ్లూకోల్ట్ సిబ్బందికి పేకాట సమాచారం ఎందుకు రావట్లేదో అర్థం కానీ పరిస్థితి. ముఖ్యంగా బ్లూకోల్ట్ సిబ్బంది కొన్ని ప్రాంతాల్లోనే తిరుగుతూ విధులు ముగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల విజిబుల్ పోలీసింగ్ సరిగ్గా లేక ట్రైసిటీలో వరుసగా చైన్‌స్నాచింగ్‌లు జరుగుతున్నాయని పోలీస్ అధికారులు భావిస్తున్నారు. పేకాట శిబిరాల్లో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న బడాబాబులు చిక్కుతున్నారు.
ఇటీవలి కొన్ని ఘటనలు..
● ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 19న పేకాట శిబిరంపై దాడి చేసి పేకాడుతున్న 9 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.73,860 నగదు, 9 సెల్‌ఫోన్లు 8 ద్విచక్రవాహనాలు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
● సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 17న పేకాట శిబిరంపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడి చేయగా.. పేకాడుతూ 10 పట్టుబడ్డారు. వారి నుంచి రూ.1,91 లక్షల నగదు, 10 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
● కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 10న జరిగిన టాస్క్‌ఫోర్స్ అధికారుల దాడిలో 9 మంది పట్టుబడగా.. వారి నుంచి రూ.1.32 లక్షల నగదు, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
● మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 8న పేకాట శిబిరంపై దాడి చేయగా 8 మంది పట్టుబడ్డారు. వారి నుంచి రూ.11,700 నగదు, 6 సెల్‌ఫోన్లు స్వాఽధీనం చేసుకున్నారు.
● మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 7న టాస్క్‌ఫోర్స్ అధికారులు పేకాట శిబిరంపై దాడి చేయగా.. 10మంది పట్టుబడ్డారు. వారి నుంచి రూ.30,250 నగదు, 10 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
● హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి 27న టాస్క్‌ఫోర్స్ అధికారులు పేకాట శిబిరంపై దాడి చేయగా.. 11 మంది పేకాట పట్టుబడ్డారు. రూ.59,340 నగదు, 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


