● హనుమకొండ కలెక్టర్,
బల్దియా ఇన్‌చార్జ్
కమిషనర్ చాహత్
● నగరంలో ఆకస్మిక
తనిఖీలు..
వరంగల్ అర్బన్/హసన్‌పర్తి: ఇంటింటా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడంలో నిర్లక్ష్యంపై హనుమకొండ కలెక్టర్, గ్రేటర్ వరంగల్ ఇన్‌చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గోపాల్‌పూర్ ఊర చెరువును, ‘వేస్ట్ టు ఆర్ట్’ ప్రాంతాన్ని, హనుమకొండ బాలసముద్రం, సెకండ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. డోర్ టు డోర్ చెత్త సేకరణలో తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరణ తగిన స్థాయిలో జరగట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 56వ డివిజనన్‌లోని గోపాల్‌పూర్ ఊర చెరువు సమీపంలో ‘వేస్ట్ టు ఆర్ట్’ కార్యక్రమంలో భాగంగా చెత్త వేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. గోపాల్‌పూర్ ఊర చెరువు వద్ద ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులు పరిశీలించారు. 53వ డివిజన్ ఆదర్శ్ నగర్‌లో విండో కంపోస్టింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. తనిఖీల్లో సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, జిల్లా ఇరిగేషన్ అధికారి కిరణ్‌కుమార్, డీఈ హర్షవర్ధన్, సూపర్‌వైజర్ నరేందర్, ఎస్సై బాషానాయక్ పాల్గొన్నారు.
నిరుద్యోగులకు వేదికవ్వాలి..
విద్యారణ్యపురి: ఉద్యోగ సాధనలో నిరుద్యోగ యువతకు ఎస్సీ స్టడీ సర్కిల్ వేదికగా నిలవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. హనుమకొండలోని ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్‌ను కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఈసందర్భంగా శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడారు. కలెక్టర్ వెంట షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ హనుమకొండ జిల్లా అధికారి బి.నిర్మల, స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ జగన్మోహన్, వార్డెన్ కృష్ణ, కనకరాజు, బి.కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
చట్టంపై విస్తృత అవగాహన కల్పించండి
హన్మకొండ అర్బన్: పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం–2013 (పోష్ యాక్ట్) పై విస్తృత అవగాహన కల్పించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా మహిళా సాధికారత కేంద్రం రూపొందించిన పోష్ యాక్ట్ వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ చాహత్ బుధవారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం. విశ్వజ, డాక్టర్ కె.అనితా రెడ్డి పాల్గొన్నారు.
గడువులోగా దరఖాస్తులు పరిష్కరించాలి
జిల్లాలో రెవెన్యూ సంబంధిత దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తహసీల్దార్లకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో భూభారతి పోర్టల్, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు, సాదా బైనామా దరఖాస్తులు తదితర రెవెన్యూ అంశాలపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, పరకాల ఆర్డీఓ డీఎస్.వెంకన్న, వివిధ మండలాల తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు పాల్గొన్నారు.


