కలెక్టర్‌ను కలిసిన ఆర్డీఓ వెంకటేశ్‌ | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ను కలిసిన ఆర్డీఓ వెంకటేశ్‌

May 28 2026 12:28 AM | Updated on May 28 2026 12:28 AM

కలెక్టర్‌ను కలిసిన ఆర్డీఓ వెంకటేశ్‌ నేడు డయల్‌ యువర్‌ డీఎం వ్యాక్సిన్‌ అందక అవస్థలు ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

హన్మకొండ అర్బన్‌: హనుమకొండ జిల్లా రెవెన్యూ డివిజనల్‌ అధికారి (ఆర్డీఓ)గా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్‌ బుధవారం కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ని కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. ములుగు ఆర్డీఓగా విధులు నిర్వహించిన వెంకటేశ్‌ బదిలీపై హనుమకొండ ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టారు. వెంకటేశ్‌కు కార్యాలయ ఉద్యోగులు, అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు.

హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు, సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్‌ ధరంసింగ్‌ తెలిపారు. ఈనెల 28న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హనుమకొండ డిపో నుంచి డయల్‌ యువర్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జమ్మికుంట, వేలేరు, ఐనవోలు, పర్వతగిరి, సంగెం, ఖిలా వరంగల్‌, హనుమకొండ, వరంగల్‌, హసన్‌పర్తి, కమలాపూర్‌, కాజీపేట మండలాల ప్రయాణికులు 89777 81103 నంబర్‌కు ఫోన్‌ చేసి సమస్యలు వివరించాలని, సలహాలు, సూచనలు అందించాలని ఆయన కోరారు.

కాశిబుగ్గ: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో హెపటైటిస్‌–బీ వ్యాక్సిన్‌ పూర్తి స్థాయిలో అందక పేషెంట్లకు ఇబ్బందులు తప్పట్లేదు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు నిరాశతో ఇంటి ముఖం పడుతున్నారు. ఆర్థికంగా ఉన్నవాళ్లు ప్రైవేట్‌ మెడికల్‌ షాపులను ఆశ్రయించి కొనుగోలు చేస్తున్నారు. అయితే వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ వ్యాక్సిన్‌ను ఎంజీఎంలోని పిల్లల వార్డు వద్ద పంపిణీ చేస్తుంటారు. ఇక్కడ పిల్లలతో పాటు పెద్దలకు కూడా వ్యాక్సిన్‌ తీసుకోవడానికి అవకాశం ఉంది. కాగా, ఈ వ్యాక్సిన్‌ కొరతపై జిల్లా ఇమ్యునైజేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రకాశ్‌ను వివరణ కోరగా.. పిల్లలకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందని, పెద్ద వాళ్లకు మాత్రం వ్యాక్సిన్‌ లేదని తెలిపారు. ప్రభుత్వం నుంచి వ్యాక్సిన్‌ సరఫరా చేసినప్పుడు ఇస్తామని పేర్కొన్నారు. అయితే డయాలసిస్‌ రోగులు, క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు ఈ వ్యాక్సిన్‌ ఇస్తుంటామని వివరించారు.

న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీస్‌ స్టడీ సర్కిల్‌ హైదరాబాద్‌, మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా మైనార్టీ అభ్యర్థులకు (ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కు, జైన, బౌద్ధ పార్సీ) సివిల్‌ సర్వీసెస్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు హనుమకొండ జిల్లా ఇన్‌చార్జ్‌ మైనార్టీ సంక్షేమాధికారి మేన శ్రీను, వరంగల్‌ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేశ్‌ బుధవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సీఈటీ.సీజీజీ. జీఓవీ.ఇన్‌/టెమ్రిస్‌ లింక్‌లో ఈనెల 31వరకు దరఖాస్తులు అందించాలని సూచించారు. పూర్తి వివరాలకు ఆయా జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయాల్లో సంప్రదించాలని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement