సాక్షి, వరంగల్: 45..45..45.. ఇవేవో ఇంటర్.. ఎంసెట్ ర్యాంక్ ఫలితాలు అనుకునేరు.. కాదు కాదు జిల్లాలో సూరీడు సుర్రుమంటుండడంతో టెంపరేచర్ గడియారంలో ముల్లులాగా గిర్రుమంటోంది. మార్చి నెలలో 38 డిగ్రీల నుంచి మొదలెడితే ఏప్రిల్‌లో 42 డిగ్రీల వరకు.. ఇక మే నెల వచ్చేసరికి ఏకంగా 45కుపైగా సెల్సియస్ డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగెం మండలంలో 45.7 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ సోమవారం నమోదైంది. జిల్లాలోని 13 మండలాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉండడంతో జనాలు అల్లాడిపోతున్నారు. వడగాలుల దెబ్బకు గత కొన్ని రోజులుగా పదుల సంఖ్యలో మరణాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులతో పాటు పిల్ల లపైనా ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ఫలితంగా జ్వరాలు, విరేచనాలు, వాంతులు అవుతున్నవారి సంఖ్య పెరిగింది. జూన్ తొలివారం వరకు రోహిణి కార్తె ఉండడంతో అప్పటివరకు మండుటెండలు ఎక్కువగానే ఉండొచ్చు.
వరంగల్ న‘గరమే’
ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న టాప్ 50 నగరాలన్నీ భారతదేశంలోనే ఉన్నాయని వాతావరణాన్ని అధ్యయనం చేసే వెబ్‌సైట్ ఏక్యూఐ.ఇన్ స్పష్టం చేస్తోంది. ఇందులో వరంగల్ నగరం కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 12 లక్షలకుపైగా జనాభా ఉన్న వరంగల్ నగరం దినదినాభివృద్ధి చెందుతుండడంతో రహదారులకు ఇరువైపులా చెట్లు నాటేందుకు స్థలం ఉండడం లేదు. వర్షపు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేకుండా పోయింది. గ్రేటర్ వరంగల్ పరిధిలో సుమారు 3,000 చదరపు కిలోమీటర్ల రోడ్డు వ్యవస్థ ఉంటే 50 శాతం సీసీ రహదారులు వేశారు. నగరంలో వాహనాల సంఖ్య పెరగడం కూడా వాతావరణంపై ప్రభావం చూపుతోంది. దీనికితోడు నగరంలోని కుంటలు, చెరువులు కబ్జా అవుతుండడం కూడా వాతావరణంలో మార్పులకు కారణమవుతున్నాయని సిటీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటికై నా బల్దియా మేల్కొని చారిత్రక నగరమైన వరంగల్‌లో చెట్లు, మొక్కలు నాటడం ద్వారా ఆహ్లాదకర వాతావరణంతో పర్యాటకులను ఆకట్టుకునేలా చూడాలని కోరుతున్నారు.
అప్రమత్తంగా ఉంటేనే ఆరోగ్యం
రోహిణి కార్తె కావడంతో రాబోయే రోజుల్లో ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముంది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎప్పటికప్పుడూ అలర్ట్‌లు జారీ చేస్తోంది. వీటిని దృష్టిలో ఉంచుకొని అత్యవసరముంటే తప్ప బయటకు రావొద్దు. వడదెబ్బ తగిలితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాం. అలాగే వైద్యులు అందుబాటులో ఉంటారు. అనారోగ్యానికి గురైతే వెంటనే చికిత్స తీసుకోవాలి. – డాక్టర్ సాంబశివరావు,
జిల్లా వైద్యారోగ్యవిభాగాధికారి
జిల్లాలో సుర్రుమంటున్న సూరీడు
రోహిణి కార్తె కావడంతో తీవ్ర ప్రభావం
45 డిగ్రీల సెల్సియస్‌పైనే ఉష్ణోగ్రతలు
ఇంట్లో ఉన్నా.. వడగాలులతో ఉక్కిరిబిక్కిరి
ఇప్పటికే వడదెబ్బతో పలువురి మృతి
గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉక్కిరిబిక్కిరి
సూర్యప్రతాపంతో పల్లెల్లో రైతులు, హమాలీలు, ఉపాధి కూలీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండవేడిమితో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద అష్టకష్టాలు పడుతూ ఆగమాగం అవుతున్నారు. చెరువుల తవ్వకాలకు వెళ్లిన ఉపాధి కూలీలకు సైతం చెమటలు పడుతున్నాయి. గత మూడురోజులుగా నమోదువుతున్న ఉష్ణోగ్రతలు అందరినీ ఆగమాగం చేస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు వడదెబ్బకు గురై మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఏఎన్‌ఎం సేవలను అందుబాటులో ఉంచాలని రైతులు, హమాలీలు డిమాండ్ చేస్తున్నారు.


