రోడ్డెప్పుడేస్తారు? | - | Sakshi
Sakshi News home page

రోడ్డెప్పుడేస్తారు?

May 27 2026 12:47 AM | Updated on May 27 2026 12:47 AM

మూడేళ్లుగా నిలిచిన గోపాలపురం– గొల్లపల్లి రహదారి పనులు

దుగ్గొండి: మండలంలోని గోపాలపురం– గొల్లపల్లి గ్రామాల మధ్య బీటీ రోడ్డు పనులు మూడేళ్ల క్రితం ప్రారంభమైనా.. నేటికీ పూర్తికాకపోవడంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 1.8 కిలోమీటర్ల పొడవున బీటీ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం 2023 జనవరిలో ఎంఆర్‌ఆర్‌ గ్రాంట్‌ కింద రూ.1.25 కోట్లు మంజూరు చేసింది. టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం అదే సంవత్సరం మార్చిలో కాంటాక్టర్‌ పనులు ప్రారంభించినా.. నేటికీ పనులు పూర్తి కాకపోవడం గమనార్హం.

ప్రమాదకరంగా కంకర రోడ్డు

రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా కల్వర్టులు పూర్తి చేసి కంకర పరిచారు. అనంతరం మూడు సంవత్సరాలుగా అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో రోడ్డంతా కంకరతో ప్రమాదకరంగా మారింది. ద్విచక్ర వా హనాలు, సైకిళ్లు తరచూ పంచర్లు అవుతున్నాయి. దుక్కిటెద్దులు కంకరపై నడవలేక అనారోగ్యం భారి న పడుతున్నాయి. రోడ్డుపైన ప్రయాణిస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి పడిపోయి మూడేళ్ల కాలంలో నలుగురు గాయాలపాలయ్యా రు. రోడ్డుపైన ప్రయాణం ప్రాణాంతకంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపైన దుమ్ము దూళీ కారణంగా ఊపిరి పీల్చుకోలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు ఎన్నిమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత కాంట్రాక్టర్‌తో పనులు పూర్తి చేయించాలని కోరుతున్నారు. ఈ విషయంపై వివరణ కోసం ఈఈ ఇజ్జగిరికి పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదు.

కంకర పరిచి.. బీటీ మరిచిన కాంట్రాక్టర్‌

ఇబ్బందులు పడుతున్న రైతులు, ప్రజలు

వానలు పడేలోగా బీటీ వేయాలి

గోపాలపురం నుంచి గొల్లపల్లి వరకు కంకర వేసి వదిలివేయడం వల్ల మూడేళ్లుగా ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఇదే రోడ్డు వెంట పంట పొలాల వద్దకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఎద్దుల బండితో పంట ఉత్పత్తులను ఇంటికి తీసుకొద్దామంటే ఎడ్లు నడవలేకపోతున్నాయి. ట్రాక్టర్ల యజమానులు పంచర్లు అవుతాయని రావడం లేదు. వర్షాలు ప్రారంభమయ్యేలోగా బీటీ వేసి కష్టాలు తీర్చాలి.

– కట్కూరి కోమల, సర్పంచ్‌ గోపాలపురం

Advertisement
 
Advertisement
Advertisement