నిందితుడి అరెస్ట్, రిమాండ్
వివరాలు వెల్లడించిన పోలీసులు
దుగ్గొండి: మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఓ మహిళను గొంతుకోసి హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ప్రియుడే హంతుకుడని తేల్చారు. ఈ మేరకు మంగళవారం నర్సంపేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రవీందర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు.
లక్ష్మీపురం గ్రామానికి చెందిన తాళ్లపెల్లి సుమలత భర్త మహేందర్ నాలుగు సంవత్సరాల క్రితం మృతి చెందాడు. ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందిన పాండవుల సురేశ్‌తో సుమలత సన్నిహిత సంబంధం కొనసాగిస్తుంది. వీరికి సన్నిహిత్యాన్ని గ్రామస్తులు, కాలనీ వాసులు ప్రశ్నించి హెచ్చరించడంతో అప్పటి నుంచి సురేశ్‌ను సుమలత దూరం పెట్టింది. ఇదే క్రమంలో మూడు నెలల క్రితం నుంచి సుమలత మరో వ్యక్తితో పరిచయం పెంచుకుంది.
తరచూ వీరిద్దరూ కలుసుకోవడాన్ని అనుమానిస్తూ సురేశ్ వారిని గమనిస్తూ హనుమకొండ వరకు వెళ్లాడు. బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జి వద్ద వారు ఇద్దరూ కనిపించడంతో వారిద్దరితో సురేశ్ గొడవ పడి కొట్టాడు. దీంతో అప్పటి నుంచి సుమలత.. సురేశ్‌ను పూర్తిగా దూరం పెట్టింది. దీనిని సురేశ్ తట్టుకోలేక పోయాడు.
పక్కా ప్రణాళికతో దారుణంగా గొంతు కోసి..
ఎలాగైనా సుమలతను కడతేర్చాలని నిర్ణయించుకున్న సురేశ్ ఈనెల 20న హనుమకొండకు రావాలని ఫోన్‌చేసి బతిమిలాడాడు. దీంతో కరిగిపోయిన సుమలత హనుమకొండకు వెళ్లింది. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. ఆటోలో బస్టాండ్ వచ్చారు. బస్టాండ్‌లో సుమలతను ఉండమని చెప్పి బైక్ తెచ్చుకోవడానికి వెళ్లిన సురేశ్ అక్కడే మద్యం సేవించాడు.
అనంతరం కాశిబుగ్గలో కత్తిని కొనుగోలు చేసి హనుమకొండ బస్టాండ్‌కు వచ్చి సుమలతను ఎక్కించుకుని లక్ష్మీపురం బయల్దేరాడు. ఎలుకుర్తి(హవేలీ) దాటగానే రాత్రి సమయంలో ఎస్సారెస్పీ చిన్న కాల్వ దగ్గర కాసేపు మాట్లాడుకుందామని చెప్పి తీసుకెళ్లాడు. మాయమాటలు చెప్పి శారీరకంగా కలిసిన అనంతరం అనుమానం రాకుండా ప్రేమగా మాట్లాడుతూనే తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోశాడు.
మృతదేహాన్ని పక్కన ఉన్న కాల్వలోకి తోసేశాడు. దీనిపై కుటుంబీకుల ఫిర్యాదు మేరకు సురేశ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని ఏసీపీ తెలిపారు. కాగా, కేసు చేధనలో ప్రతిభ కనబరిచిన సీఐ సాయిరమణ, ఎస్సై రణధీర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గౌస్, కానిస్టేబుల్ రంజిత్‌కుమార్‌ను ఏసీపీ రవీందర్‌రెడ్డి అభినందించారు.


