జిల్లాలో ఒకవైపు ప్రకృతి విపత్తు.. మరోవైపు మానవ తప్పిదం.. వెరసి రైతులకు నష్టం వాటిల్లుతోంది. సోమవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు నేలకూలాయి. కొందరు రైతులు తమ పొలాల్లోని పంట వ్యర్థాలకు నిప్పు పెడుతుండడంతో గాలి వేగం.. భగ్గుమంటున్న ఎండ తోడు కావడంతో సమీప పొలాలకు
మంటలు వ్యాపించాయి. దాచుకున్న పశుగ్రాసం, పొలాల్లోని పైపులు, మోటార్లు కాలిపోయాయి.
శాయంపేట : మండలంలోని పెద్దకోడెపాక గ్రామ శివారులోని బీరన్న గుడి ప్రాంగణంలో మంగళవారం పంట పొలాలనుంచి మంటలు ఎగిసిపడి గ్రామంలోని ఇల్లు, గడ్డివాము, వ్యవసాయ పనిముట్లు, ద్విక్ర వాహనాలు కాలి బూడిదయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. పెద్దకోడెపాక గ్రామంలోని బీరన్న గుడి సమీపంలోని పొలాల్లో వరికొయ్యలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో మంటలు వ్యాప్తించి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాల ఆరణలో ఉన్న చెత్తకు అంటుకున్నాయి. పాఠశాలలోని రెండు గదుల్లో ఫర్నిచర్, పిల్లల స్టేషనరీ కాలిపోయింది. అలాగే గ్రామానికి చెందిన అబ్బు భగవాన్‌రెడ్డికి ఇల్లు, వ్యవసాయ పనిముట్లు దగ్ధమయ్యాయి. అదే విధంగా అబ్బు జనార్దన్‌రెడ్డికి సంబంధించిన రెండు ద్విచక్రవాహనాలు, ఇంటి ఫర్నిచర్‌తోపాటు 20 ధాన్యం బస్తాలు, వ్యవసాయ పని ముట్లు, అబ్బు రఘుపతిరెడ్డికి చెందిన 60 సైపాన్ బ్లాక్ పైపులు, అబ్బు రాజిరెడ్డికి చెందిన 400 కట్టల గడ్డివాము దగ్ధమైంది. దీంతో యువకులు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైరింజన్ సమయానికి రాకపోవడంతో గ్రామస్తులు, యువకులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. గంట తర్వాత ఫైరింజన్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎస్సై పరమేశ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.
చర్లపల్లి, కంఠాత్మకూరులో..
నడికూడ: ఈదురు గాలులతో కురిసిన వర్షం మంగళవారం సాయంత్రం బీభత్సం సృష్టించింది. చర్లపల్లి గ్రామానికి చెందిన దూడే రాజయ్య ఇంటి రేకులు ఎగిరిపోవడంతోపాటు మిర్చి పంట తడిసి ముద్దయ్యింది. సల్మాన్‌ఖాన్‌కు చెందిన హోటల్ పైకప్పు రేకులతోపాటు గోడ కూలిపోయింది. కంఠాత్మకూరులో చెట్టు పడిపోయింది. సర్పంచ్ తిరుపతి జేసీబీ సాయంతో తొలగించారు.
కమలాపూర్‌లో..
కమలాపూర్: ఈదురు గాలులకు మండలంలో పలుచోట్ల చెట్లు, చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. మరికొన్ని చోట్ల ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. కమలాపూర్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగగా సిబ్బంది పునరుద్ధరించారు.
గడ్డి కట్టలు దగ్ధం
వేలేరు: ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని సుమారు వెయ్యి గడ్డి కట్టలు, 20 గుంటల మిర్చి పంట, పైపులతోపాటు రెండు బర్రెలకు గాయాలైన ఘటన గొల్లకిష్టంపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన పొలంలోని మొక్కజొన్న కొయ్యలు కాల్చాడు. మంటలు ఆరిపోయాయని ఇంటికి వెళ్లగా గాలికి తిరిగి మంటలు చెలరేగి పక్కనున్న ఎండిపోయిన చెట్టుకు అంటుకున్నాయి. అక్కడి నుంచి కరెంట్ తీగలపై పడి షార్ట్ సర్క్యూట్ జరిగి ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు రైతులు బత్తుల రాజు, సంజీవరెడ్డి, జినుకల శంకర్‌కు చెందిన మిర్చి పంట, గడ్డి కట్టలు, పైపులు దగ్ధమయ్యాయి. మంటలతో రెండు బర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు.
నేలకొరిగిన వందేళ్ల ఊడల మర్రి చెట్టు..
శాయంపేట: ఈదురుగాలులకు అప్పయ్యపల్లె గ్రామ శివారులో ఉన్న వందేళ్లకు పైబడిన ఊడల మర్రి చెట్టు నేలకొరిగింది. గత వేసవిలో గుర్తుతెలియని వ్యక్తులు చెట్టు మొదట నిప్పు పెట్టగా స్థానికులు, అగ్నిమాపక శాఖ అధికారులు మంటలు ఆర్పివేశారు. అప్పటి నుంచి చెట్టు కాలిపోయిన భాగం తొర్రలా మారింది. ఈదురు గాలుల కు నేలకొరడంతో ప్రగతిసింగారం నుంచి కటాక్షపూర్‌కు వాహనాల రాకపోకలకు అంతరాయం కలి గింది. అప్పయ్యపల్లె సర్పంచ్ రాంపురి సుప్రియ జేసీబీ సాయంతో చెట్టును తొలగించారు.
జిల్లాలో పలుచోట్ల
ఈదురుగాలుల బీభత్సం
నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
పంట వ్యర్థాలకు
మంట పెడుతున్న రైతులు
పెద్దకోడెపాకలో పాఠశాలలోకి
వ్యాపించిన మంటలు


