మారితే మంచిది.. లేదంటే కఠిన చర్యలు..! | - | Sakshi
Sakshi News home page

మారితే మంచిది.. లేదంటే కఠిన చర్యలు..!

May 27 2026 12:47 AM | Updated on May 27 2026 8:11 AM

-

రౌడీ.. మారకపోతే ‘పీడీ’!

మళ్లీ మొదలైన కౌన్సెలింగ్‌

రౌడీల కట్టడికి మరోసారి పోలీసుల ముందస్తు చర్యలు

వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో 752 మంది రౌడీషీటర్లు

సాక్షిప్రతినిధి, వరంగల్‌: రౌడీషీటర్ల ఆగడాలు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మళ్లీ పెరుగుతుండటంతో పోలీసుశాఖ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. వరంగల్‌, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీస్‌తో పాటు జనగామ, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల్లో రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. ఐదారు రోజులుగా వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌తో పాటు అన్ని జిల్లాల్లో రౌడీషీటర్లను పోలీసుస్టేషన్‌లకు పిలిచి మళ్లీ కౌన్సెలింగ్‌ చేస్తున్నారు.

స్టేషన్ల వారీగా సమీక్ష.. కౌన్సెలింగ్‌..
ఇటీవల ప్రజావాణి కార్యక్రమాలు, కలెక్టరేట్లు, పోలీస్‌స్టేషన్లు, కమిషనరేట్‌కు అందుతున్న ఫిర్యాదుల్లో భూవివాదాలు, సెటిల్‌మెంట్లు, బెదిరింపుల కేసులే అధికంగా ఉండటం పోలీసుశాఖను అప్రమత్తం చేసింది. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులతో చేతులు కలిపి కొందరు రౌడీషీటర్లు ఖాళీ స్థలాలు, వివాదాస్పద భూముల విషయంలో జోక్యం చేసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో మళ్లీ రౌడీషీటర్ల లిస్టుపై పోలీసుస్టేషన్ల వారీగా సమీక్ష చేస్తున్నారు. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ప్రస్తుతం సుమారు 752 మంది రౌడీషీటర్లు ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం. గతంలో నేరాలకు పాల్పడి ప్రస్తుతం సత్ప్రవర్తనతో జీవిస్తున్న వారిని గుర్తించి రౌడీషీట్లు ఎత్తివేయాలనే ఆలోచనతోపాటు.. నేర ప్రవృత్తిని కొనసాగిస్తున్న వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. గతంలో చేపట్టినట్లే ఈసారి కూడా ముందుగా కౌన్సెలింగ్‌ ద్వారా మార్పు తీసుకురావాలని పోలీసుశాఖ నిర్ణయించింది.

ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్లను పిలిపించి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. నేరాలకు దూరంగా ఉండాలని, సాధారణ జీవితం గడపాలని, లేకపోతే కఠిన చట్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఒకటి రెండు సార్లు హెచ్చరించినా మారని వారిపై పోలీసులు ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ (పీడీ) యాక్టు ప్రయోగించేందుకు ఫైళ్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.

ప్రత్యేక నిఘా.. సీక్రెట్‌ రిపోర్టులు
పోలీస్‌స్టేషన్ల వారీగా ‘హిస్టరీ షీటర్లు’, ‘రౌడీషీటర్లు’, ‘గూండాలు’, ‘సస్పెక్టెడ్‌ ఆఫెండర్స్‌’జాబితాలను నవీకరిస్తున్నారు. వీరి కదలికలపై స్పెషల్‌ బ్రాంచ్‌, టాస్క్‌ఫోర్స్‌, స్థానిక పోలీసులు కలిసి నిఘా ఉంచుతున్నారు. సోషల్‌ మీడియాలో బెదిరింపులు, సెలబ్రేషన్ల పేరుతో మారణాయుధాలను ప్రదర్శించడం, రీల్స్‌ ద్వారా భయాందోళనలు సష్టించడం వంటి అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు.

మారితే మంచిది.. లేదంటే కఠిన చర్యలు..
ప్రజల్లో భద్రతాభావం పెంచడం, ట్రైసిటీస్‌లో శాంతిభద్రతలు కాపాడడం లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. కౌన్సెలింగ్‌తో మారిన వారికి సహకరిస్తామని.. కానీ అదే పద్ధతి కొనసాగిస్తే పీడీ యాక్టు, నగర బహిష్కరణ, బైండోవర్‌, నిరంతర పర్యవేక్షణ తప్పదని స్పష్టం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement