సంగెం : పంటలు చేతికొచ్చాక వ్యవసాయ భూముల్లో మిగిలిన వ్యవసాయ వ్యర్థాలను రైతులు కాల్చుతున్నారు. దీంతో భూసారం తగ్గిపోవడంతోపాటు సమీపంలోని పచ్చని చెట్లు మంటల్లో కాలిపోయి దెబ్బతింటున్నాయి. ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా పంటపొలాల గట్లకు నాటిన మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగి పెద్దగా అయ్యాయి. ప్రస్తుతం రైతులు పంట వ్యర్థాలను కాల్చే క్రమంలో పంటలు ఆ చెట్లకు అంటుకుని చనిపోతున్నాయి. దీంతోపాటు పంటలకు మేలు చేసే పలురకాల కీటకాలు సైతం మృత్యువాత పడుతున్నాయి. చెట్ల సంఖ్య తగ్గిపోతున్న కారణంగా సకాలంలో వర్షాలు కురవడం లేదు. ఏటా లక్షలాది మొక్కలు నాటుతూ వాటి సంరక్షణకు రూ.కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇంత చేస్తున్నప్పటికీ మొక్కల సంరక్షణపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో హరితహారం లక్ష్యం నెరవేరడం లేదు.
రైతులకు అవగాహన కల్పించాలి
హరితహారంలో ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు పెరిగి పెద్దయ్యాయి. వాటిపై అధికారులు పర్యవేక్షణ చేస్తుండాలి. కానీ, వారు విధులు నిర్వర్తించడంతో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. మండలంలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, గ్రామాల అంతర్గత, వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలు అగ్నికి ఆహుతవుతున్నాయి. కొన్ని చోట్ల విద్యుత్ తీగలు తగులుతున్నాయని విద్యుత్ శాఖ వారు నరికి వేస్తుండగా అవి మోడువారి పోతున్నాయి. ఇక మిగిలిన చోట్ల మండలంలోని కుంటపల్లి, సంగెం, తిమ్మాపూర్, పల్లారుగూడ, నల్లబెల్లి, మొండ్రాయి, గవిచర్ల, తీగరాజుపల్లి, కాట్రపల్లి, ఆశాలపల్లి, వెంకటాపూర్ తదితర గ్రామాల్లోని రైతులు తమ పంట పొలాల్లోని మొక్కజొన్న, వరి కొయ్యల వ్యర్థాలకు నిప్పంటిస్తున్నారు. గాలివాటానికి పక్కనే ఉన్న హరితహారం చెట్లు కాలిబుడిదవుతున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రహదారులకు రైతులకు అవగాహన కల్పించడంతోపాటు రైతులకు మొక్కల సంరక్షణ బాధ్యతలు అప్పంగించడం ద్వారా ఈ నష్టాన్ని తగ్గించవచ్చని పర్యావరణప్రియులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి రైతులకు అవగాహన కల్పించి విలువైన పచ్చని వృక్షసంపద అగ్నికి ఆహుతి కాకుండా కాపాడాల్సిన అవసరం ఉందని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
తిమ్మాపూర్‌లో కాలిపోయిన బృహత్
పల్లె ప్రకృతి వనం
గాంధీనగర్ వద్ద కాలిపోయిన హరితహారం చెట్లు
అగ్నికి ఆహుతి అవుతున్న
హరితహారం చెట్లు
పంట వ్యర్థాలను
కాల్చొద్దంటున్న నిపుణులు


