నర్సంపేట: వేసవి సెలవులు కావడంతో పలువురు ఇళ్లకు తాళాలు వేసి పర్యాటక ప్రాంతాలు, స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఇదే అదనుగా భావించిన దుంగడులు ఇళ్లకు తాళం వేసి ఉన్న చోట దొంగతనాలకు పాల్పడుతున్నారు. నర్సంపేట పట్టణం సర్వాపురం శివారులో గజ్జి రవిసునీత నివాసముంటున్నారు. ఈక్రమంలో ఆదివారం వారు చర్చిలో ప్రార్థనలకు వెళ్లి వచ్చేలోగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి మూడున్నర తులాల బంగారం, రూ.40వేల నగదు అపహరించారు. విషయం తెలిసిన పట్టణ సీఐ ముస్కు శ్రీనివాస్ టీం అక్కడకు చేరుకుని ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెలవులకు ఊరెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ సూచించారు. పోలీసులు మీ కోసం కార్యక్రమంలో దొంగతనాల విషయంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. దొంగలు రెక్కి నిర్వహించి, తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడే అవకాశం ఉందని సీఐ తెలిపారు.
పోలీసుల సూచనలు ఇవి...
● దూరప్రాంతాలకు వెళ్లేటప్పుడు కానీ, పర్యాటక ప్రాంతాలకు వెళ్లేప్పుడు ఇంట్లో విలువైన
వస్తువులు, నగదు ఉంచకూడదు.
● అవకాశం ఉంటే బ్యాంకులో భద్రపర్చుకోవాలి.
● రాత్రి వేళ ఇంటి ముందు విద్యుత్ దీపాలు వెలిగేలా చూసుకోవాలి.
● ఇంటికి వేసే తాళం కనిపించకుండా
కర్టన్‌ను అడ్డుగా ఉంచుకోవాలి.
● ఇంటిని విడిచి వెళ్లే ముందు సమీప బంధువులు, నమ్మకమైన పొరుగు వారికి, పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
● పూలకుండీలు, షూ ర్యాకులు, డోర్ మ్యాట్ల
కింద ఇంటి తాళం చెవులు పెట్టవద్దు.
● ఊరికి వెళ్లే ముందు వాట్సాప్‌లో కానీ, ఇతర సామాజిక మాధ్యమాల్లో సమాచారాన్ని
అనుసరించి దొంగలు పసిగట్టి చోరీ చేసే
అవకాశం ఉన్నది.
● ఇంటి వద్ద సీసీ కెమెరాలు పని చేసేలా ఏర్పాటు చేసుకుంటే మంచిది.
● ఇంటి పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్ 100కు సమాచారం
అందించాలి.
● కుటుంబ సమేతంగా ఊరు వెళ్లే వారు సమీప పోలీస్‌స్టేషన్‌కు తెలియజేస్తే రాత్రి వేళ పోలీసులు ఆ ప్రాంతంలో నిఘా పెంచుతారు.
నిఘా పెంచుతున్నాం..
వేసవి సెలవుల్లో ఊరెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందిస్తే ఆ ప్రాంతంలో నిఘా పెంచడానికి వీలుంటుంది. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు జరుగుతున్న చోరీలను పసిగట్టాం. ప్రజలు తప్పనిసరిగా పోలీసులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తే మంచిది.
– ముస్కు శ్రీనివాస్, సీఐ,
నర్సంపేట టౌన్
నర్సంపేటలో మూడున్నర తులాల
బంగారం, రూ.40వేల నగదు అపహరణ


