● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
ఖిలా వరంగల్: ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. భూముల మార్కెట్ విలువ పెంపు, భూ భారతి దరఖాస్తులు, హౌసింగ్, హీట్ వేవ్స్ వంటి పలు అంశాలపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో కలెక్టర్ డాక్టర్ సత్యశారద సమీక్ష నిర్వహించారు. భూముల మార్కెట్ విలువ పెంపు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేపట్టాలని సూచించారు. పలు ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. భూ భారతి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా వేగవంతంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రతీ దరఖాస్తును పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలన్నారు.
బక్రీద్ పండుగ నిర్వహణపై సమీక్ష
ఈనెల 28న జరగనున్న బక్రీద్ పండుగ సందర్భంగా ఆరోగ్య, పారిశుద్ధ్య ఏర్పాట్లపై అధికారులతో కలెక్టరేట్‌లో కలెక్టర్ సత్యశారద శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బక్రీద్‌ను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ముస్లిం మతపెద్దలకు సూచించారు. జంతు అవశేషాలను సక్రమంగా సేకరించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. ఆయా సమీక్ష సమావేశాల్లో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేష్ (లోకల్ బాడీ), డీఎఫ్‌ఓ నిఖిత, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్వో విజయలక్ష్మి, డీపీఓ కల్పన, డీసీసీ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్, డీఎండబ్ల్యూఓ రమేష్, జీడబ్ల్యూఎంసీ హెల్త్ ఆఫీసర్ రాజేష్, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్, తదితరులు పాల్గొన్నారు.
గ్రామ ప్రణాళికలను ఆన్‌లైన్ చేయాలి
● డీఎల్‌పీఓ వేదవతి
గీసుకొండ: పంచాయతీ కార్యదర్శులు, ఈ – పంచాయతీ ఆపరేటర్లు సమన్వయంతో పనిచేస్తూ గ్రామ ప్రణాళికలను (జీపీడీపీ) ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని డీఎల్‌పీఓ వేదవతి సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఈ – గ్రామ్ స్వరాజ్ పోర్టల్, ఆన్‌లైన్ చెల్లింపులు, డిజిటల్ సంతకాలు, తదితర విషయాలపై అవగాహన సదస్సును శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీపీడీపీ రూపకల్పన, నిధుల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. పారదర్శకంగా గ్రామాభివృద్ధి ప్రణాళికలు రూపొందించే అంశాలపై జిల్లా ప్రోగ్రాం మేనేజర్ దివ్య అవగాహన కలిగించారు. సదస్సులో ఎంపీఓ పాక శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.


