రైతువేదికల్లో సమస్యల తిష్ట | - | Sakshi
Sakshi News home page

రైతువేదికల్లో సమస్యల తిష్ట

May 24 2026 1:21 AM | Updated on May 24 2026 1:21 AM

రైతువేదికల్లో సమస్యల తిష్ట

వసతుల కల్పనలో నిర్లక్ష్యం

నెక్కొండ : మండలంలోని రైతువేదిక భవనాల్లో సమస్యలు తిష్ట వేశాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీస వసతుల కల్పనలోనూ ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న వ్యాఖ్యలున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి భవనాలు నిర్మించి సామగ్రి సమకూర్చిన ప్రభుత్వం కొన్నిటికి ప్రహరీలు నిర్మించలేదు. దీంతో అకతాయిలకు అడ్డాగా సైతం మారాయి. భవనాల్లోని విలువైన సామగ్రికి రక్షణ సైతం కరువైంది.

రైతులకు పంటల సాగులో సలహాలు, సూచనలు అందిస్తూ ఆధునిక, శాస్త్ర సాంకేతిన పరిజ్ఞానాన్ని చేరువ చేసే పేరుతో గత ప్రభుత్వం మండలంలోని పెద్దకొర్పోలు, నెక్కొండ, నాగారం, రెడ్లవాడ, దీక్షకుంట, అలంకానిపేట, తోపనపల్లి గ్రామాలను క్లస్టర్లుగా ప్రకటించి రైతువేదిక భవనాలు నిర్మింపజేసింది. భవనాల్లో వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యం ఏర్పాటు చేసింది. ప్రతి మంగళవారం రైతులకు శాస్త్రవేత్తలు హైదరాబాద్‌ కేంద్రం నుంచి సస్యరక్షణ చర్యలపై సూచనలు అందిస్తున్నారు.

వసతులు నామమాత్రం

రైతువేదిక భవనాల్లో మౌలిక వసతులు నామమాత్రంగా కల్పించారు. పలు భవనాల్లో తాగునీటి, ఇతర సౌకర్యాలు కల్పించలేదు. ప్రహరీ నిర్మించలేదు. భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో వేదికల్లోని సామగ్రిని ధ్వంసం చేయడం, ఎత్తుకెళ్లడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పలు రైతువేదికల ఆవరణల్లో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. కొన్ని చోట్ల మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కాలేదు. నీటి వసతి లేకపోవడంతో అవి నిరూపయోగంగా మారాయి. గతంలో పంట వివరాలు నమోదు చేసేందుకు ఏఓలు, ఏఈఓలు రైతువేదికలకు వచ్చే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలోనే పంటలు నమోదు చేస్తుండడంతో ఏఓలు, ఏఈఓలు రైతువేదికల వైపు వెళ్లడం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement