● ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్త విశ్వతేజ
దుగ్గొండి : పంటల సాగులో యూరియా వాడకాన్ని తగ్గించాలని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్) శాస్త్రవేత్త విశ్వతేజ సూచించారు. మండలంలోని నాచినపల్లిలో శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. రసాయనిక ఎరువుల వినియోగం వల్ల పెట్టుబడి పెరుగుతుందని తెలిపారు. యూరియాను విచ్చలవిడిగా వాడితే భూసారం దెబ్బతింటుందని, నైట్రోజన్ ప్రభావంతో రైతులు కేన్సర్ బారిన పడతారని చెప్పారు. వీలైనంత తక్కువ యూరియా వినియోగించాలని, సేంద్రీయ ఎరువులు వేయాలని తెలిపారు. తొలకరి వర్షాలకు పచ్చిరొట్ట విత్తనాలు సాగు చేయాలని చెప్పారు. తద్వారా భూమి సారవంతం అవుతుందని తెలిపారు. మిరప పంటలో మందుల వాడకం తగ్గింకునేలా సాధ్యమైనంత ఎక్కువగా జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. రాబోయే ఖరీఫ్‌లో ప్రభుత్వం సూచించిన వరి విత్తనాలు సాగు చేసిన వారికే బోనస్ లభిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఓ గాజుల శ్యామ్, ఇఫ్‌కో జిల్లా మేనేజర్ విశాల్, సర్పంచ్ పెండ్యాల రాజు, సింగిల్ విండో డైరెక్టర్ నల్ల శ్యాంసుందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఏరువాక సాగుబడితో అధిక దిగుబడులు
నల్లబెల్లి : ఏరువాక సాగుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని ఏఓ బన్న రజిత తెలిపారు. మండలంలోని దస్తగిరిపల్లిలో సర్పంచ్ పులి రమేశ్ అధ్యక్షతన నిర్వహించిన ఏరువాక రైతు సాగుబడి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మొక్కజొన్న, వరి పంటల కోత అనంతరం మిగిలే అవశేషాలను కాల్చొదని కోరారు. వరికొయ్యలను రోటోవేటర్ సాయంతో సింగిల్ సూపర్ పాస్పేట్ లేదా వేస్ట్ డికంపోజర్‌ను వినియోగించి భూమిలో కలియదున్నాలని సూచించారు. తద్వారా భూమిలో సేంద్రియ కర్బన శాతం తగ్గకపోగా భూసారం పెరుగుతందని వివరించారు. కార్యక్రమంలో ఏఈఓ శివ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


