● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి,
ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
వరంగల్ చౌరస్తా: ప్లాస్టిక్ నిషేధం మనందరి బాధ్యత అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. ప్రజాపాలన ప్రగతి–ప్రణాళికలో భాగంగా వరంగల్ హంటర్‌రోడ్డులోని శ్రీకన్వెన్షన్ హాల్‌లో శుక్రవారం జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కలెక్టర్ డాక్టర్ సత్యశారద పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు విజయవంతం కావాలంటే అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్లు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారని ప్రశంసించారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, కల్యాణలక్ష్మి, రైతుభరోసా వంటి పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల ముంగిటకు చేరుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యార్థుల హాజరుశాతం పెంపు కోసం ఈ విద్యాసంవత్సరం నుంచి అల్పాహారం పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ 99 రోజుల కార్యాచరణలో భాగంగా 10 కీలక అంశాలపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం వివిధ శాఖల నివేదికను విడుదల చేశారు. డీఆర్వో విజయలక్ష్మి, అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి, వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఆనందం, నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం లక్ష్మి, వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ సారంగపాణి పాల్గొన్నారు.


