కాజీపేట: 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి పాలనలో భాగంగా వడ్డేపల్లి ట్యాంక్‌బండ్‌పై శుక్రవారం నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ స్వయంగా చెత్తాచెదారం తొలగించారు. జిల్లా పర్యాటక అధికారి శివాజీ, ఎంసీహెచ్‌ఓ రాజారెడ్డి, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బొల్లెపల్లి రాజేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
సాక్షిప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగాన్ని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఎస్సీ విభాగాన్ని మరింత చురుకుగా మార్చేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి ఐదు జిల్లాలకు కొత్త చైర్మన్లను నియమిస్తూ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఐదు జిల్లాల చైర్మన్లు వీరే..
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం హనుమకొండ జిల్లా చైర్మన్‌గా ఆరూరి సాంబయ్య, వరంగల్ జిల్లాకు చిలువేరు శ్రీనివాస్, జనగామకు చేపూరి వినోద్, మహబూబాబాద్‌కు తిప్పర్తి శ్రీధర్, ములుగు జిల్లాకు మట్టెవాడ తిరుపతిని నియమించారు. జాబితాలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు నియమించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, కాంగ్రెస్ ఎస్సీ విభాగంలో చేపట్టిన ఈ మార్పులు రాబోయే రోజుల్లో పార్టీ క్షేత్రస్థాయి రాజకీయాలకు ఎంతవరకు బలం చేకూరుస్తాయో? అనే చర్చ మొదలైంది.
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఈసీజీ టెక్నీషియన్లు ఓపీ విధులకు ఆలస్యంగా రావడంతో పేషెంట్లకు ఎదురుచూపులు తప్పలేదు. శుక్రవారం ఉదయం 8 గంటలకు రావాల్సిన సిబ్బంది 10 దాటినా విధులకు హాజరు కాకపోవడంతో వారి కోసం పేషెంట్లు గంటల తరబడి ఎదురుచూశారు. అసలే వేసవి కావడంతో గంటల తరబడి ఉక్కపోతలో ఎదురుచూడాల్సి వచ్చిందని వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నీషియన్లు రాలేదన్న విషయాన్ని సూపరింటెండెంట్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన టెక్నీషియన్లను పిలిపించి, ఆలస్యానికి కారణాలు తెలుసుకుని మందలించారు. తర్వాత పేషెంట్లకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, ఈసీజీ పరీక్షలు చేయించారు.
హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట : రాష్ట్ర రెవెన్యూ శాఖలో జరిగిన బదిలీల్లో భాగంగా హనుమకొండ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్‌డీఓ) రాథోడ్ రమేశ్ నిర్మల్ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ)గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ప్రస్తుతం హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఎన్..నిర్మలను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
వరంగల్ అదనపు కలెక్టర్‌గా కిశోర్‌కుమార్
వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఎల్.కిశోర్‌కుమార్ నియమితులయ్యారు. నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను జిల్లాకు బదిలీ చేసి ఆ స్థానానికి వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ కాలపరిమితి పూర్తయిన 15 మంది ఏఎస్‌ఐలు, 160 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 47 మంది కానిస్టేబుళ్లకు శుక్రవారం అధికారులు బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించారు. వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.


