జిల్లా స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు
హన్మకొండ అర్బన్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు తెలిపారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్‌లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యచరణపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేలా సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 2న భారీగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల వరి ధాన్యం, 70 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు, రైతులకు స్ప్రేయర్లు, స్ప్రింక్లర్లు, దివ్యాంగులకు బ్యాటరీ వాహనాలు అందజేశారు.
ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి
హనుమకొండ కలెక్టరేట్‌లో భాగ్యరెడ్డి వర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీడీ నిర్మల తదితరులు పాల్గొన్నారు.
● డీసీసీ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి
హన్మకొండ చౌరస్తా: ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తున్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ సహించదని ‘కుడా’ చైర్మన్, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి హెచ్చరించారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. న్యూశాయంపేటలోని హనుమాన్ ఆలయ వ్యవహారంలో ఎమ్మెల్యే నాయినికి సంబంధం లేనప్పటికీ ఉద్దేశపూర్వకంగా అందులోకి లాగడం రాజకీయ కుట్రలో భాగమన్నారు. అసత్య ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దెబ్బతీయాలని చూసే ప్రయత్నాలు ఫలించవని హెచ్చరించారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, మామిండ్ల రాజు, జక్కుల రవీందర్, భద్రకాళి ఆలయ ధర్మకర్త గాండ్ల స్రవంతి, మంద రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.


