పల్లె వైద్యానికి
మూడేళ్లుగా పీహెచ్‌సీలకు రాని హాస్పిటల్ డెవలప్‌మెంట్ ఫండ్
సాక్షి, వరంగల్: గ్రామీణ ప్రజలకు తొలి వైద్య ఆశ్రయంగా నిలిచే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రతీఏడాది ఆస్పత్రుల నిర్వహణ, చిన్న చిన్న మరమ్మతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ బిల్లులు, ఫర్నిచర్, ల్యాబ్ రియాజెంట్లు, అత్యవసర ఔషధాల కొనుగోలు వంటి అవసరాలకు ఇవ్వాల్సిన హాస్పిటల్ డెవలప్‌మెంట్ ఫండ్ (హెచ్‌డీఎఫ్) సమయానికి విడుదల కాకపోవడంతో పీహెచ్‌సీల పరిస్థితి దయనీయంగా మారుతోంది. నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో ప్రతీఏటా హెచ్‌డీఎఫ్ విడుదల చేయడంలో నిర్లక్ష్యం నెలకొనడంతో పేదల వైద్యసేవలపై ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది. మూడేళ్లుగా ప్రతిపాదనలు పంపించినా ఫలితం ఉండడం లేదు. దీంతో ప్రతీ చిన్న పనికి కూడా దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వసతులు సమకూర్చుకునేందుకు తంటాలు పడుతున్నారు. వైద్య పరికరాలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. రోగులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. ఔషధాల కొరత, ల్యాబ్ పరీక్షలపై ప్రభావం, విద్యుత్, తాగు నీటి బిల్లుల భారం, పారిశుద్ధ్యంపై ప్రభావం పడుతోంది. ఫలితంగా మందులు, పరీక్షలు, సౌకర్యాలు లేక ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యంపై నమ్మకం సన్నగిల్లి రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
మూడేళ్లుగా రావాల్సిన నిధులు రూ.94.50లక్షలు
ప్రాథమిక కేంద్రాల ఆరోగ్య నిర్వహణకు కేంద్రం ఆర్థిక చేయూతను అందిస్తోంది. ఒక్కో దానికి రూ.1.50 లక్షలు మంజూరు చేస్తోంది. జిల్లాలో 14 పీహెచ్‌సీలు, ఏడు యూపీహెచ్‌సీలు ఉన్నాయి. ఈ లెక్కన 21 కేంద్రాలను తీసుకుంటే ఏడాదికి రూ.31.50లక్షల చొప్పున మూడు సంవత్సరాలను రూ.94.50 లక్షల నిధులు విడుదల కావాల్సి ఉంది. అయితే ఆరోగ్య కేంద్రాల పరిశీలనకు వచ్చిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా మోక్షం లభించడం లేదు.
ఖానాపురం
పీహెచ్‌సీలో
పనిచేయని ఫ్యాన్
సరైన వసతులు లేక రోగులకు తిప్పలు
వైద్య పరికరాలు, రిఫ్రిజిరేటర్లు మరమ్మతుకు నోచుకోక అవస్థలు
ఇప్పటికై నా నిధులివ్వాలని కోరుతున్న వైద్యులు
జిల్లాలో చాలా చోట్ల ప్రహరీలు లేకపోవడంతో పశువుల సంచారంతో అపరిశుభ్రత దర్శనమిస్తోంది. మూత్రశాలలు, భవనంపైకప్పు, గోడలకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఫ్యాన్లు, విద్యుత్ తీగలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. రోగుల తాకిడికి అనుకూలంగా వసతులు కల్పించడం లేదు. కనీసం కూర్చునేందుకు బెంచీలు, కుర్చీలు లేక నిలబడే పరిస్థితి నెలకొంది. చెడిపోయిన వైద్య పరికరాలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఏ వస్తువులు చెడిపోయినా బాగు చేసుకునేందుకు సిబ్బంది సతమతమవుతున్నారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం..
పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలకు రావాల్సిన హస్పిటల్ డెవలప్‌మెంట్ ఫండ్ గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. అత్యవసర వైద్య పరికరాలు, రిఫ్రిజిరేటర్లు మరమ్మతులయ్యేలా చూస్తున్నాం. రోగులకు తమ పరిధిలో వైద్యసేవలు అందించేలా చూస్తున్నాం. – డాక్టర్ సాంబశివరావు, డీఎంహెచ్‌ఓ


