పంచాయతీలకు భవనాలు కరువు | - | Sakshi
Sakshi News home page

పంచాయతీలకు భవనాలు కరువు

May 15 2026 9:56 AM | Updated on May 15 2026 9:56 AM

పంచాయతీలకు భవనాలు కరువు

ఇరుకు.. ఒకే గది

ఏడాది క్రితమే..

ప్రజలకు, పాలకవర్గాలకు ఇబ్బందులు

ఖానాపురం : గ్రామ పంచాయతీలు అద్దె భవనాల్లో కొనసాగుతుండడంతో ప్రజలు, పాలకవర్గాలకు ఇబ్బంది తప్పడం లేదు. పలు తండాలను పంచాయతీలుగా ప్రకటించిన గత ప్రభుత్వం సదరు జీపీలకు భవనాలు నిర్మింపజేయడాన్ని విస్మరించింది. తదనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం సైతం సొంత భవనాల్లేని గ్రామ పంచాయతీలను పట్టించుకున్న దాఖలాల్లేవంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మండలంలో 21 గ్రామ పంచాయతీలున్నాయి. కాగా 14 పంచాయతీలకు సొంత భవనాలుండగా మిగతా ఏడు అద్దె గదుల్లో, ప్రభుత్వ పాఠశాల భవనాల్లో కొనసాగుతున్నాయి. కొడ్తిమాటుతండా, బాల్‌తండా, భద్రుతండా, బోటిమీదితండా, బండమీదిమామిడితండా, నాజీతండాలకు సొంత భవనాల్లేవు. కొత్తూరులో చేపట్టిన పంచాయతీ భవనం అసంపూర్తిగా నిర్మాణ దశలో ఉంది. అద్దె గదుల్లో, అరకొర వసతుల నడుమ పంచాయతీల నిర్వహణ ఇబ్బందిగా పరిణమించిందంటూ పలువురు సర్పంచ్‌లు, వార్డు సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు.

నిధుల కేటాయింపు కీలకం

గ్రామ పంచాయతీలకు భవనాలు నిర్మించడానికి అవసరమైన స్థల సేకరణతోపాటు నిధుల కేటాయింపు కీలకం. కాగా గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఆ దిశగా చేసిందేమీ లేదు. కొడ్తిమాటుతండా, బాల్‌తండా, భద్రుతండా, బోటిమీదితండా, బండమీదిమామిడితండా, నాజీతండా గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి స్థల సేకరణ సైతం చేపట్టలేదు. ఈ క్రమంలో ప్రభుత్వ పథకాల అమలులో, పాలకవర్గాల సమావేశాల నిర్వహణకు సర్పంచ్‌లు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఇరుకై న అద్దె గదుల్లో తాగునీటి, మరుగుదొడ్లు, తదితర కనీస మౌలిక వసతులు సైతం లేవు. ఇకనైనా ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సొంత భవనాల్లేని గ్రామ పంచాయతీలన్నిటికీ స్థలాలు సేకరించడంతోపాటు నిధులు కేటాయించి సత్వరమే సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కేటాయించారు. ఇరుకై న, ఒకే గదిలో కార్యాలయ నిర్వహణ చాలా ఇబ్బందిగా ఉంది. సమావేశం నిర్వహించాలన్నా సమస్య ఎదురవుతోంది. వర్షాలు కురిస్తే ఫైళ్లు తడిచి నష్టం జరిగే ప్రమాదం ఉంది.

– బానోతు వీరన్న, సర్పంచ్‌, భద్రుతండా

నూతన పంచాయతీలకు భవనాల నిర్మాణం కోసం ఏడాది క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాము. నాలుగు సార్లు సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాము. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే భవనాలు నిర్మింపజేసే దిశగా చొరవ తీసుకుంటాము.

– అంబటి సునీల్‌కుమార్‌, ఎంపీఓ

Advertisement
 
Advertisement
Advertisement