కాజీపేట మీదుగా వేసవి 8 ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

కాజీపేట మీదుగా వేసవి 8 ప్రత్యేక రైళ్లు

May 15 2026 9:56 AM | Updated on May 15 2026 9:56 AM

కాజీపేట మీదుగా వేసవి 8 ప్రత్యేక రైళ్లు అంత్య పుష్కరాలకు ఆహ్వానం

కాజీపేట రూరల్‌ : వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి కోసం కాజీపేట జంక్షన్‌ మీదుగా హైదరాబాద్‌–గోరఖ్‌పూర్‌ మధ్య అప్‌ అండ్‌ డౌన్‌ రూట్‌లో 8 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు కాజీపేట రైల్వే అధికారులు బుధవారం తెలిపారు.

ప్రత్యేక రైళ్ల వివరాలు..

జూన్‌ 5, 12, 19, 26వ తేదీల్లో హైదరాబాద్‌–గోరఖ్‌పూర్‌ (07075) మధ్య ప్రయాణించే సమ్మర్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట జంక్షన్‌కు 23:28 గంటలకు చేరుకుంటుంది. జూన్‌ 7, 14, 21, 28వ తేదీల్లో హైదరాబాద్‌–గోరఖ్‌పూర్‌ (07076) వెళ్లే సమ్మర్‌ స్పెషల్‌ ట్రైన్‌ కాజీపేట జంక్షన్‌కు మరుసటి రోజు 04:48 గంటలకు చేరుకుంటుంది. ఈ రైళ్ల సర్వీస్‌లకు సికింద్రాబాద్‌, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బల్లార్షా, చంద్రాపూర్‌, నాగపూర్‌ జంక్షన్‌, బేతుల్‌, ఈటార్సీ, భోపాల్‌, బీనా జంక్షన్‌, విజిల్‌ ఝాన్సీ జంక్షన్‌, ఒరాయ్‌, పొక్రాయన్‌, ఖాన్‌పూర్‌ సెంట్రల్‌, ఆష్‌భాగ్‌ జంక్షన్‌, లక్నో సిటీ, గోంటినగర్‌, బరబంకి జంక్షన్‌, గోండా జంక్షన్‌లో హాల్టింగ్‌ సౌకర్యం కల్పించారు. ఈ వేసవి ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

రుద్రేశ్వరుడిని దర్శించుకున్న

జస్టిస్‌ తిరుమలాదేవి

హన్మకొండ కల్చరల్‌ : వరంగల్‌ నగరంలోని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని బుధవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తిరుమలాదేవి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు ఆలయ మర్యాదలతో జస్టిస్‌ తిరుమలాదేవి దంపతులను ఘనంగా స్వాగతించారు. ఆమె రుద్రేశ్వరుడిని దర్శించుకుని గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంగు ఉపేంద్రశర్మ తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా జస్టిస్‌ తిరుమలాదేవి మాట్లాడుతూ.. తాను పలుమార్లు ఈ దేవాలయాన్ని సందర్శించి మొక్కుబడులు సమర్పించుకున్నట్లు తెలిపారు. దేవాలయాలు సమాజహిత కేంద్రాలుగా విరజిల్లాలని, పురాతన దేవాలయాల్లో పూజలు నిర్వహించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని పేర్కొన్నారు.

కాళేశ్వరం : కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది అంత్య పుష్కరాలకు ప్రముఖులను దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ హనుమంతరావు ఆహ్వాన పత్రికలు అందజేశారు. బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావులకు ఆహ్వాన పత్రిక అందజేశారు. వారి వెంట కాళేశ్వరం దేవస్థానం చైర్మన్‌ మోహన్‌శర్మ, ఆర్‌జేసీ రామకృష్ణరావు, ఈఓ మహేష్‌, ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement