గుడి.. రాజకీయ వేడి! | - | Sakshi
Sakshi News home page

గుడి.. రాజకీయ వేడి!

May 13 2026 2:08 AM | Updated on May 13 2026 2:08 AM

ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో

కాకతీయుల నాటి శివాలయం కూల్చివేత

ప్రతిపక్ష పార్టీల నాయకుల రాకతో

పెరిగిన పొలిటికల్‌ హీట్‌

ప్రభుత్వంపై బీజేపీ ప్రతిపక్ష నేత ఏలేటి,

బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం

గుడి, యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మిస్తామంటున్న కాంగ్రెస్‌ నేతలు

సాక్షి, వరంగల్‌/ఖానాపురం: ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో ఉన్న 794 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన శివాలయం కూల్చివేత రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఈ ఆలయాన్ని సందర్శించారు. కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు పునర్నిర్మించాలని డిమాండ్‌ చేశారు. భూములపై ఉన్న పిచ్చితో దేవాలయ భూములను కాంగ్రెస్‌ నాయకులు కబ్జా చేస్తున్నారని ఈ నెల 8న ఏర్పాటు చేసిన సత్యాగ్రహ దీక్షలో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ధరణిలో దేవాదాయశాఖ భూమిగా ఉంటే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక భూభారతిలో ప్రభుత్వ భూమిగా ఎలా మారిందో చెప్పాలని, లంకెబిందెల కోసమే కాంగ్రెస్‌ ప్రభుత్వం శివాలయాలను కూల్చేస్తోందని హరీశ్‌రావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా ‘తెలంగాణ చరిత్ర, సంస్కృతి, అస్తిత్వం మీద ఏమాత్రం అవగాహన లేని మూర్ఖుల పాలన సాగుతోందంటూ.. తక్షణం ప్రభుత్వమే శివాలయాన్ని పునఃరుద్ధరించాలి’ అని డిమాండ్‌ చేశారు. ఆలయాన్ని పునఃరుద్ధరించడంతో పాటు సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, ఆర్కియాలజీ పరిధిలోకి తీసుకువస్తామని నర్సంపేట కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అంతకుముందే బదులిచ్చినా.. ఈ శివాలయం కూల్చివేత రాజకీయ వేడిని మాత్రం పెంచేసింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ నెల 7న ఆర్కియాలజీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బుజ్జి సందర్శించింది. గర్భగుడి కింద సుమారు 24 ఫీట్ల లోతు తవ్వకాలు చేపట్టి, ఆ తర్వాత సగానికి పైగా కూల్చివేసినట్లు ఆనవాళ్లు కనిపించినట్లు నివేదిక ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడంపై మంత్రి హరీశ్‌రావు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆలయం కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఖానాపురం పోలీస్‌స్టేషన్‌లో బీఆర్‌ఎస్‌ శ్రేణులు మంగళవారం ఫిర్యాదు చేయడంతో మరింత వేడి నెలకొంది. గర్భగుడి కింద భారీగా తవ్వకాలు ఎందుకు జరిగాయనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కూల్చివేత మరిన్ని విమర్శలకు తావిస్తోంది.

అసలేం జరిగిందంటే..

ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్‌లో 1232లో గణపతి దేవుని ఆధ్వర్యంలో శివాలయ నిర్మాణం చేశారు. సుమారు 14 ఎకరాల విస్తీర్ణంలో శివాలయాన్ని నిర్మించి చుట్టూ మట్టికోటను ఏర్పాటు చేశారు. ఇటీవల నర్సంపేటకు యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకోసం శివాలయానికి చెందిన 30 ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో మట్టికోట లోపల శివాలయంతో కూడిన 14 ఎకరాల స్థలాన్ని సైనిక్‌స్కూల్‌ అధికారులు అప్పగించారు. దీంతో ఈనెల నాలుగో తేదీ రాత్రి సమయంలో సంబంధిత కాంట్రాక్టర్‌ ఆధ్వర్యంలో పనులు చేస్తూ శివాలయాన్ని కూల్చడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పురాతన శివాలయం ఆలయాన్ని పునఃరుద్ధరించడంతో పాటు సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం’ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చెప్పిన మాటలు ఆచరణ రూపంలోకి వచ్చేంత వరకు ఈ రాజకీయ సెగలు చల్లారేలా లేదు. ఆలయాన్ని కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోకున్నా ఈ ఆధ్యాత్మిక అంశం ఎటువైపు మళ్లుతుందోనన్న టెన్షన్‌ అందరిలో నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement