వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ నగర సేవలు మరింత మెరుగుపడాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, బల్దియా ఇన్‌చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్.. అధికారులను ఆదేశించారు. మంగళవారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో నగరంలో పారిశుద్ధ్యం, ప్రజాసేవలు, ఆదాయ వనరుల బలోపేతం, వ్యర్థాల నిర్వహణ, వాహనాల వినియోగం, పార్కుల అభివృద్ధి తదితర అంశాలపై సంబంధిత వింగ్ అధికారులతో ఆమె సమీక్షించాకరు. సమావేశంలో అదనపు కమిషనర్ చంద్రశేఖర్, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, సీపీ రవీంద్ర రాడేకర్, ఉప కమిషనర్లు బి.శ్రీను, సమ్మయ్య, సీహెచ్‌ఓ రమేష్, ఈఈలు రవి కుమార్, సంతోష్ బాబు, మాధవి, మహేందర్ తదితరులున్నారు.
జనగణను పరిశీలన
హనుమకొండలోని 28వ డివిజన్ పరిధిలో గోవిందరాజుల గుట్ట, సత్యం లేన్, స్టేషన్ రోడ్ ప్రాంతాల్లో జరుగుతున్న జనగణన ఎన్యుమరేషన్ ప్రక్రియను హైదరాబాద్ జనగణన శాఖ జాయింట్ డైరెక్టర్ డి. సుబ్బరాజు పరిశీలించారు. ప్రతీ కుటుంబ వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు.
‘ఎస్‌ఐఆర్’ మ్యాపింగ్ వేగంగా పూర్తి చేయండి
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) మ్యాపింగ్ ప్రక్రియను వందశాతం పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిపై వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయడంపై అధికారులకు అవగాహన కల్పించారు. ఎస్‌ఐఆర్ పురోగతిపై సోమవారం మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, జెడ్పీ సీఈఓ శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్, ఇన్‌చార్జ్
కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్


