టెన్షన్‌..టెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

టెన్షన్‌..టెన్షన్‌

May 11 2026 7:14 AM | Updated on May 11 2026 7:14 AM

సాక్షి, వరంగల్‌: జిల్లాలోని ఉపాధి హామీ కూలీలకు ఈ–కేవైసీ గుబులు పట్టుకుంది. 1,11,381 మంది కూలీలకు ఉండగా 1,07,235 మందికి మాత్రమే నమోదైంది. 96.27 శాతంతో రాష్ట్రంలో ఈ–కేవైసీ ప్రక్రియలో మూడో స్థానంలో నిలిచింది. కేంద్రం నిర్దేశించిన ఈ–కేవైసీ నమోదు ప్రక్రియ నేటి (సోమవారం)తో ఆఖరు కావడంతో మిగిలిన 4,146 మందివి కూడా సాధ్యమైనంత తొందరగా చేయాలని సిబ్బంది భావిస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలతో కాస్త ఉపాధి హామీ కూలీల డేటా అప్‌డేట్‌ ఆలస్యమవుతోంది. ఉపాధి హామీలో అక్రమాలను నిరోధించడానికి ప్రతిఒక్కరికీ ఈ– కేవైసీ తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం గతేడాది ఏప్రిల్‌లో ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పని ప్రదేశాల్లో కూలీల నమోదు, వేతనాల చెల్లింపులకు ఈ–కేవైసీనే ప్రామాణికంగా తీసుకొని కేంద్రం ముందుకెళ్లనుంది. కొంత మంది కూలీలు అందుబాటులో లేకపోవడం, ఆధార్‌లోని వివరాలు, ఫొటో సరితూగకపోవడం, ఐరిస్‌లో మార్పులు తదితర సమస్యలు నమోదుకు ఆటంకంగా మారాయి. ఇప్పటికే ఈ–కేవైసీ ప్రక్రియను సోమవారం వరకు అన్ని గ్రామాల్లో పూర్తి చేయాలని పంచాయతీ రాజ్‌ శాఖ జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ–కేవైసీ ప్రక్రియ మరింత వేగవంతం చేశారు. అయితే కేంద్రం నుంచి గడువు పొడిగింపు వస్తేనే వందశాతం పూర్తయ్యే అవకాశముంది. లేదంటే జిల్లాలోని ఈ–కేవైసీ కానీ కూలీలకు వేతనాలు చెల్లింపు, హాజరు నమోదు, పనిదినాల లబ్ధిలో ఆటంకాలు ఎదురవుతాయన్న ఆందోళన కనబడుతోంది.

ఉమ్మడి జిల్లాలో రెండో స్థానం

ఈ–కేవైసీ నమోదు చేసిన వాటిపరంగా ఉమ్మడి వరంగల్‌ లెక్కన చూసుకుంటే వరంగల్‌ జిల్లా 96.27 శాతంతో రెండో స్థానంలో ఉంది. హనుమకొండ జిల్లా 89,478 మందికి 86,357 (96.53 శాతం) ఈ–కేవైసీ నమోదుతో తొలి స్థానంలో ఉండగా, 1,11,381 మందికి 1,07,235 మంది (96.27 శాతం)తో వరంగల్‌ రెండో స్థానంలో ఉంది. జనగామ జిల్లా 1,14,974 మందికి 1,09,003 మంది (94.83 శాతం)తో మూడో స్థానంలో, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా 1,11,376 మందికి 1,03,876 (93.35 శాతం)తో నాలుగో స్థానంలో, ములుగు జిల్లా 82,091 మందికి 75,596 మంది (92.21 శాతం)తో ఐదో స్థానంలో, మహబూబాబాద్‌ జిల్లా 2,23,580 మందికి 2,04,580 మంది (91.11) శాతంతో ఆరో స్థానంలో ఉంది.

ఉపాధి కూలీలకు ఈ–కేవైసీ ఇబ్బందులు

జిల్లాలో ఇప్పటి వరకు 1,07,235

మందికి మాత్రమే పూర్తి

4,146 మంది కూలీలకు

పూర్తి కాని పరిస్థితి

నేటితో ముగియనున్న గడువు

వందశాతం పూర్తి చేస్తామంటున్న అధికారులు

మండలం మొత్తం ఈ–కేవైసీ కావాల్సినవి

కూలీలు నమోదు

చెన్నారావుపేట 8,645 8,233 412

దుగ్గొండి 13,148 12,680 468

గీసుగొండ 5487 5,244 243

ఖానాపురం 7,662 7,392 270

నల్లబెల్లి 10,227 9,905 322

నర్సంపేట 8,210 7,946 264

నెక్కొండ 15,731 15,064 665

పర్వతగిరి 11,881 11,551 330

రాయపర్తి 13,067 12,644 420

సంగెం 10,942 10,394 548

వర్ధన్నపేట 6,387 6,182 204

Advertisement
 
Advertisement
Advertisement