ఘనంగా వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

May 11 2026 7:14 AM | Updated on May 11 2026 7:14 AM

నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని ద్వారకా వేణుగోపాల వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం బ్రహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొని స్వామి వారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్‌, కమిటీ సభ్యులు, కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

డాక్టర్‌ శ్రీలతకు ఉత్తమ మహిళా సైకాలజిస్ట్‌ అవార్డు

కాళోజీ సెంటర్‌: తెలంగాణ సైకాలజిస్ట్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ శ్రీలత అందేకు ప్రతిష్టాత్మకమైన ఉత్తమ మహిళా సైకాలజిస్ట్‌ అవార్డును అందుకున్నారు. టీపీఏ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగి కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు. డాక్టర్‌ శ్రీలత మనోవిజ్ఞాన శాస్త్ర రంగంలో అందించిన సేవలకు గుర్తింపుగా అవార్డు లభించగా టీపీఏ రాష్ట్ర అధ్యక్షుడు మోత్కూరి రామచందర్‌ ప్రత్యేక అతిథిగా పాల్గొని అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా టీపీఏ సభ్యులు, ప్రముఖులు ఆమెను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

నేడు జిల్లా, డివిజన్‌ స్థాయి ప్రజావాణి

న్యూశాయంపేట: ప్రభుత్వం ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన రెవెన్యూ డివిజన్‌ స్థాయి ప్రజావాణిని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతీ సోమవారం జిల్లా స్థాయిలో కలెక్టర్‌ అధ్యక్షతన ప్రజావాణితో పాటు రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు ఆయా ప్రజావాణిల్లో తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ప్రజల వినతులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నేటినుంచి జనగణన ప్రక్రియ

న్యూశాయంపేట : జిల్లావ్యాప్తంగా జనగణన–2027కు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితి, తదితర అంశాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రణాళిక, గణాంక శాఖ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా అధికారులు సన్నద్ధమవుతున్నారు. జనాభా లెక్కలు రెండు విడతల్లో 33 అంశాలపై వివరాలు సేకరించనున్నారు. ఏప్రిల్‌ 26 నుంచి మే 10వ తేదీ (ఆదివారం) వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ (స్వీయ జనగణన) ప్రక్రియ ముగిసింది. మలివిడతలో సోమవారం(నేటి) నుంచి జూన్‌ 9వ తేదీ వరకు ఎన్యుమరేటర్స్‌ బ్లాక్‌ల వారీగా ఇళ్ల సంఖ్యను లెక్కించనున్నారు. అనంతరం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపట్టే రెండో దశలో జనాభా పూర్తి వివరాలను నమోదు చేస్తారు.

వివరాల సేకరణ..

జనగణనలో భాగంగా వ్యక్తి పేరు, ఇంటిపేరు, కుటుంబ యజమానితో బంధుత్వం, వయస్సు, లింగం, చదువు, టీవీ, బైక్‌, కారు వంటి వివరాలను అధికారులు సేకరించి నమోదు చేస్తారు. ఎస్సీ, ఎస్టీల కులం వివరాలు కూడా సేకరిస్తారు. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 14 మండలాల్లో (12 మండలాలు, రెండు మున్సిపాలిటీలు) 1,237 హౌజ్‌ లిస్టింగ్‌ బ్లాక్స్‌ (హెచ్‌ఎల్‌బీస్‌) గుర్తించారు. ఇందుకు 933 మంది ఎన్యుమరేటర్స్‌ను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. వీరితో పాటు 161 మంది సూపర్‌ వైజర్లను ఎంపిక చేసి ఇందులో భాగస్వాములు చేయనున్నారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 1,094 మంది సిబ్బంది పాల్గొననున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement