జిల్లాలో పడిపోతున్న సగటు నీటిమట్టం
సాక్షి, వరంగల్:
జిల్లాలో భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి. ఓవైపు పంటల సాగు.. మరోవైపు భానుడి భగభగతో క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్‌లోనే చేతికి అందివచ్చే వరి, మొక్కజొన్న, మిర్చి పంటల సాగుకు అత్యధిక నీటి వినియోగం కూడా ఓ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. జనవరి నుంచి ప్రతి నెల నెలకు దిగువకు చేరుతున్న భూగర్భజలాలు.. నాలుగు నెలల్లో 2.33 మీటర్లకు తగ్గినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో జిల్లాలో సగటు భూగర్భజల మట్టం 6.21 మీటర్లు ఉంటే ఈసారి మరో 0.03 మీటర్లు కిందకు దిగజారి 6.24 మీటర్లు ఉండడం గమనార్హం. గతేడాది జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలు కలుపుకుంటే 854 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 1,102.4 మిల్లీమీటర్లు కురిసింది. అంటే 29 శాతం అదనంగా వర్షపాతం నమోదవడం కూడా ఈసారి పెద్దగా నీటి నిల్వలకు ఇబ్బంది లేకుండా పోయింది. పర్వతగిరి మండలంలో 13 మీటర్లు, సంగెం మండలంలో 12.54 మీటర్ల దిగువన నీరు ఉండడం కాస్త ఆందోళన కలిగించినా మేలో పెద్దగా వ్యవసాయ పనులు ఉండే అవకాశం లేకపోవడంతో నీటి ఇబ్బందులు ఉండకపోవచ్చని భూగర్భజల విభాగాధికారులు అంటున్నారు. మరోవైపు చెరువులు, కుంటల్లో నీరు ఇంకిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో మాత్రం నీటి కోసం తిప్పలు తప్పడం లేదు. బావులు, బోరుబావుల్లో నీటిమట్టం పడిపోతూ మే ఆరంభంలోనే ప్రజలకు నీటి కరువును చూపెడుతున్నాయి. కొన్నిచోట్ల వ్యవసాయదారులు తమ చేతికి అందివచ్చిన కూరగాయలు, ఇతర పంటలు కాపాడుకునేందుకు బోర్లు సైతం వేస్తుండడం కనిపిస్తోంది.
ఏప్రిల్ నాటికి 6.24 మీటర్ల దిగువన నీరు
పర్వతగిరి, సంగెం మండలాల్లో ఆందోళన
ఈ నెలలో మరింత లోతుకు వెళ్లే అవకాశం
ప్రధాన కారణాలు..
వేసవి ప్రారంభమైన ఏప్రిల్‌లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో నేలలోని తేమ వేగంగా ఆవిరైపోయింది. దీంతో భూగర్భజలాల పునరుత్పత్తి తగ్గుముఖం పట్టింది.
ఏప్రిల్‌లో సాధారణంగా వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి. భూమిలోకి కొత్తగా నీరు చేరకపోవడంతో జలమట్టం క్రమంగా దిగజారుతోంది.
తాగు, సాగునీటి అవసరాల కోసం రైతులు, గ్రామాలు ఎక్కువగా బోర్లపై ఆధారపడతాయి. ముఖ్యంగా వరి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటల సాగుకు అధిక పంపింగ్ చేస్తారు. దీనివల్ల ఏప్రిల్ నెలలో ఎక్కువగా భూగర్భజలాలు వినియోగించారు.
ఉపరితల జలవనరులైన చెరువులు, కుంటలు ఎండిపోవడం వల్ల భూగర్భ జలాలకు సహజ రీచార్జ్ తగ్గిపోతుంది. వర్షపు నీరు భూమిలోకి చొప్పించే రీచార్జ్ పిట్స్, ఇంకుడు గుంతలు సరిపడా లేకపోవడం వల్ల జలమట్టం పునరుద్ధరణ కాకపోవడం కూడా ఓ కారణంగా ఉంది.
గత పంటకాలంలోనే భూగర్భజలాలను విస్తృతంగా వినియోగించడం వల్ల ఏప్రిల్ నాటికి నిల్వలు తగ్గిపోయాయి.


