గీసుకొండ: మూస ధోరణిలో పంటలను సాగు చేస్తున్న రైతులు.. శాసీ్త్రయంగా వ్యవసాయం చేసేలా ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం శ్రీరైతు ముగింట్లో శాస్త్రవేత్తలుశ్రీ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గత నెల 27న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈనెల 23 వరకు కొనసాగనుంది. పంటల సాగుపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు రైతులకు అవగాహన కలిగిస్తున్నారు. ఇందుకోసం జిల్లాలో వ్యవసాయ శాస్త్రవేత్తలతో కూడిన 10 బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతీ బృందం 8 చొప్పున మొత్తం 80 రైతు అవగాహన సదస్సులను నిర్వహించాల్సి ఉంటుంది.
ఒక్కో బృందంలో ఇద్దరు శాస్త్రవేత్తలు
తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (టీఆర్‌వీకే) వ్యవసాయ పరిశోధన స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) సంయుక్తంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమానికి రూపకల్పన చేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రతీ బృందానికి ఇద్దరు శాస్త్రవేత్తలు వారికి కేటాయించిన గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ అధికారులు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు పాల్గొంటున్నారు.
పంటమార్పిడి.. యూరియా వాడకం తగ్గించడం
రైతులు ఒకే పంటను సాగు చేయడం మానుకోవాలని, భూసార పరీక్షలు చేయించి తదనుగుణంగా పంట మార్పిడి చేసి లాభసాటి పంటలు సాగు చేయాలని, అలాగే యూరియా వాడకం తగ్గించాలని, నానో యూరియా, డీఏపీ వాడితే పెట్టుబడి తగ్గి దిగుబడి పెరుగుతుందని సదస్సుల్లో శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. గత వానాకాలం, యాసంగిలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. చిరుధాన్యాలు, ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయనే సంకేతాలతో వరి, పత్తిని తగ్గించి మొక్కజొన్న, కంది, పెసర, మినుములు, అలసంద, పసుపు, మిరప, సోయాబీన్, వేరుశనగ, తదితర పంటలు సాగుచేయాలని సూచిస్తున్నారు.
ఎలాంటి సూచనలు చేస్తున్నారంటే..
వేసవిలో వరి, మొక్కజొన్న పంటలను కోసిన తర్వాత లోతు దుక్కులను దున్నుకోవాలి. దీంతో పంటలకు నష్టం చేసే పురుగుల లార్వాలు బయటపడి ఎండ వేడిమికి నశిస్తాయి. పంట అవశేషాలను కాల్చవద్దు. అలాచేస్తే నేలలోని విలువైన సేంద్రీయ కర్బనం వృథా అవుతుంది. మిత్ర పురుగులు చనిపోయి వాయు కాలుష్యం పెరుగుతుంది.
తొలకరి వర్షాలకు జీలుగు, పిల్లిపెసర, జనుము విత్తనాలు వేసి పంట ఏపుగా పెరిగిన తర్వాత దుక్కిలో కలియదున్నాలి. తద్వారా భూసారం పెరురుతుంది. ఎక్కువ ఎరువులు వేసే భారం తగ్గుతుంది.
నాణ్యమైన విత్తనాలను వాడాలి. దాంతో పురుగుల బెడద తగ్గి దిగుబడి పెరుగుతుంది.
మోతాదును మించి రసాయన ఎరువులను వాడవద్దు. సమతుల్యంగా వేస్తే నేల పొరల్లో పేరుకుని పోయిన భాస్వరాన్ని తిరిగి మొక్కలకు అందేలా చేయవచ్చు.
వరిలో 8 రకాలు వంగడాలు మేలైనవి. జిల్లాకు అనుకూలమైనవి. వాటిలో భూసారం ఆధారంగా అనుకూలమైనవి వేయాలి.
సేంద్రియ పద్ధతిలో సాగు చేయాలి. కంపోస్టు ఎరువులు, పశువుల పేడ, గొర్రె ఎరువు, పెంట, నల్లరేగడి మట్టి వేయాలి.
నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడాలి. డ్రిప్, తుంపర సేద్యం చేయాలి.
మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి ఆదాయం పొందాలి.
ఈ నెల 23 వరకు గ్రామాల్లో అవగాహన సదస్సులు
జిల్లాలో 10 బృందాలను ఏర్పాటు చేసిన అధికారులు
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
రైతుల వద్దకే శాస్త్రవేత్తలు వస్తున్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి రైతు సదస్సుకు హాజరై అవగాహన పెంచుకోవాలి. పంటమార్పిడి చేసి శాసీ్త్రయ పద్ధతిలో మేలైన రకాలను సాగు చేయాలి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలి.
– డాక్టర్ విజయ్‌భాస్కర్, టీఆర్‌వీకే కోఆర్డినేటర్


