రామన్నపేట: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ అయూబ్ శుక్రవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ను వేర్వేరుగా కలిశారు. తన జన్మదినం సందర్భంగా మర్యాదపూర్వకంగా వారిని కలువగా ఆశీస్సులు తెలిపారని ఆయూబ్ పేర్కొన్నారు. తనకు ఫోన్‌ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డికి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, యశస్వినిరెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే బస్వరాజు సారయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసినట్లు చెప్పారు.
ఉపాధి హామీని సద్వినియోగం చేసుకోవాలి
ఖానాపురం: ఉపాధి హామీ పథకాన్ని కూలీలు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఓ నాగపద్మజ సూచించారు. ఉపాధి హామీ పథకం కింద బుధరావుపేట, ధర్మరావుపేట గ్రామాల్లో ఎక్కువ మంది కూలీలకు పని దినాలు కల్పించిన ఎఫ్‌ఏలు పసునూరి వెంకటేశ్వర్లు, కుమార్‌కు శుక్రవారం ఒక్కొక్కరికి రూ.1000 నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పనులకు తప్పకుండా వెళ్లాలన్నారు. పనుల వద్ద వసతులు కల్పించి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఓ సునీత తదితరులు పాల్గొన్నారు.
కార్మిక హక్కులపై అవగాహన కల్పించాలి
న్యూశాయంపేట: కార్మిక హక్కులు, సంక్షేమంపై అవగాహన పెంపొందించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. హనుమకొండ నక్కలగుట్ట డీసీసీబీలో శుక్రవారం మేడే వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలలో భాగంగా సంక్షేమ పథకాలపై కార్మికులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీబీసీడీఓ పుష్పలత, ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ సాత్విక, కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు.
బారులుదీరిన మొక్కజొన్న వాహనాలు
సంగెం: షాపూర్ శివారు మహబూబాబాద్–వరంగల్ ప్రధాన రహదారిలో మొక్కజొన్నల వాహనాలు బారులుదీరాయి. షాపూర్ శివారు ఓరైస్ మిల్లులోని గోదాంను మొక్కజొన్నల దిగుమతి కోసం అద్దెకు తీసుకున్నారు. ఇతర మండలాలకు చెందిన మొక్కజొన్నలు, మార్కెట్, సొసైటీ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన మొక్కజొన్న లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లు దిగుమతి కోసం సుమారు కిలోమీటరు మేర బారులుదీరాయి. శుక్రవారం మేడే కావడం, హమాలీలు రాకపోవడంతో దిగుమతి నిలిచిపోయింది.
కాజీపేట రైల్వే పిట్ లైన్ల తనిఖీ
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే పిట్‌లైన్లను శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ (డీఆర్‌ఎం) గోపాలకృష్ణన్ తనిఖీ చేశారు. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో అధికారుల బృందంతో కలిసి డీజిల్‌షెడ్ వద్ద రైలు దిగి పిట్ లైన్లను తనిఖీ చేశారు. రైళ్ల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఆర్‌ఎం డీజిల్ కాలనీలోని రైల్వే కమ్యూనిటీ హాల్, రైల్వే చిల్డ్రన్స్ పార్కును తనిఖీ చేశారు. ఈనెల 10న ప్రధాన మంత్రి మోదీ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వర్చువల్‌గా ప్రారంభించనున్న నేపథ్యంలో.. రైల్వే అధికారులు రైల్వే కమ్యూనిటీ హాల్‌లో ఉండేందుకు కావాల్సిన సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. అనంతరం ప్రత్యేక రైలులో డీఆర్‌ఎం కాజీపేట మీదుగా పెద్దపల్లి, నిజామాబాద్‌కు తనిఖీల నిమిత్తం వెళ్లారు.


