ఖిలా వరంగల్: అభివృద్ధిలో కార్మికుల శ్రమ ఎంతో కీలకమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌లో హమాలీ యూనియన్ నాయకుడు సురేశ్ అధ్యక్షతన శుక్రవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా మంత్రి హాజరై కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్ ఆర్డీఓ సుమ, మార్కెట్ కార్యదర్శి మల్లేశం, కార్మిక నాయకులతో కలిసి జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికులకు ప్రతినెల వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం రూ.50 వేలు మందులకు మంజూరు చేస్తామని హమీ ఇచ్చారు. సంఘటిత కార్మికులకు రూ.549తో పోస్టాఫీస్ ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తోందని పేర్కొన్నారు. మార్కెట్ అధికారులు 1,325 మంది కార్మికులకు డబ్బులు చెల్లించి బీమా సౌకర్యం కల్పిస్తారని ఆమె వివరించారు. కార్మికులు విశ్రాంతి తీసుకునేందుకు, భోజనాలు చేయడానికి రూ.60 లక్షలతో కమ్యూనిటీహాల్ నిర్మాణం కోసం పంపిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. కార్పొరేటర్ అనిల్, నాయకులు గోపాల నవీన్‌రాజు, మీసాల ప్రకాశ్, సోమిశెట్టి ప్రవీణ్, కొత్తపల్లి శ్రీనివాస్, జారతి రమేశ్, ఎలగం సత్యనారాయణ, వర్తక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జారతి శ్రీనివాస్, మున్నాభాయ్, వేణుగోపాల్, చందర్, మర్రి శ్రీనివాస్, సాంబయ్య, చంద్రయ్య, సంపత్, క్రాంతి, సుధాకర్, రాజయ్య పాల్గొన్నారు.
అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌లో ఘనంగా మేడే వేడుకలు


