శోభాయమానం.. పుష్పయాగం | - | Sakshi
Sakshi News home page

శోభాయమానం.. పుష్పయాగం

May 1 2026 4:10 AM | Updated on May 1 2026 4:10 AM

భద్రకాళి ఆలయంలో ముగిసిన

కల్యాణ బ్రహ్మోత్సవాలు

హన్మకొండ కల్చరల్‌: భద్రకాళి దేవాలయంలో శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు గురువారం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తిని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. చూర్ణోత్సవం జరిపి చక్రతీర్థోత్సవం నిర్వహించి తిరిగి చక్రాన్ని అమ్మవారి సన్నిధికి చేర్చారు. అనంతరం పూర్ణాహుతి, బలిహరణ, ధ్వజారోహణంతో ఉత్సవాలు సమాప్తం చేశారు. అలాగే దేవాలయం చుట్టూ అమ్మవారి ఊరేగింపు జరపడానికి వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి విరాళంగా అందజేయనున్న కోటి రూపాయలతో 30 అడుగుల రథం తయారీకి ఉపయోగించే కలపకు పూజలు చేశారు.

అమ్మవారికి పుష్పయాగం

అమ్మవారికి శతఘటాభిషేకం జరిపి రాత్రి స్నపనమందిరంలో అమ్మవారికి వేదపండితులు మంత్రోచ్ఛరణ చేస్తుండగా రంగురంగుల గులాబీలు, మల్లెలు, లిల్లీలు, విరజాజులతో పుష్పయాగం నిర్వహించారు. పుష్పయాగం నిర్వహించడం వల్ల బ్రహ్మోత్సవాల్లో జరిగిన దోషాలు తొలగిపోతాయని భద్రకాళి శేషు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement