సాక్షి, వరంగల్:
పదో తరగతిలో జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాయి. అనేక మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు తెచ్చుకున్నారు. ఇందుకు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆధ్వర్యంలో నిర్వహించిన స్ఫూర్తి కార్యక్రమం దోహదపడిందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. జిల్లాలోని 13 మండలాల్లో 288 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 136 పాఠశాలలు (47.22 శాతం) పదో తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించాయి. దుగ్గొండి మండలంలోని మొత్తం 11 ప్రభుత్వ పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి. జిల్లాలోనే 100 శాతం ఫలితాలు సాధించిన మండలంగా దుగ్గొండి నంబర్ వన్ స్థానంలో నిలిచింది. గీసుకొండ మండలంలో 21 పాఠశాలలకు 8, ఖానాపురం మండలంలో 11 పాఠశాలలకు 4, ఖిలా వరంగల్ మండలంలో 46 పాఠశాలలకు 19, నల్లబెల్లి మండలంలో 11 పాఠశాలలకు 4, నర్సంపేట మండలంలో 28 పాఠశాలలకు 16, నెక్కొండ మండలంలో 17 పాఠశాలలకు 9, పర్వతగిరి మండలంలో 16 పాఠశాలలకు 2, రాయపర్తి మండలంలో 16 పాఠశాలలకు 9, సంగెం మండలంలో 15 పాఠశాలలకు 13, వరంగల్ మండలంలో 71 పాఠశాలలకు 37, వర్ధన్నపేట మండలంలో 16 పాఠశాలలకు 5 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. చెన్నారావుపేట మండలంలో 9 ప్రభుత్వ పాఠశాలలుండగా.. ఒక్క పాఠశాలలో కూడా 100 శాతం ఫలితాలు రాలేదు. ఏ పాఠశాలలో కూడా సున్నా శాతం ఫలితాలు నమోదు కాలేదని విద్యాశాఖ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
లెక్క తప్పారు..
జిల్లాలో 9,492 మంది విద్యార్థులకు 9,034 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 458 మంది విద్యార్థులు ఫెయిలైతే సబ్జెక్ట్‌లు మాత్రం 624 తప్పాయి. కొందరు విద్యార్థులు రెండు, మూడు సబ్జెక్ట్‌లు తప్పడంతో ఈ సంఖ్య 624కు చేరిందని విద్యావిభాగాధికారులు చెబుతున్నారు. గణితంలో 262 మంది (బాలురు 145, బాలికలు 117) ఫెయిలయ్యారు. ఆ తర్వాత సైన్స్‌లో 151 మంది (బాలురు 88, బాలికలు 63), ఇంగ్లిష్‌లో 106 మంది (బాలురు 65, బాలికలు 41), తెలుగులో 51 మంది (బాలురు 30, బాలికలు 21), సోషల్‌లో 43 మంది (బాలురు 25, బాలికలు 18), హిందీలో 11 మంది (బాలురు 3, బాలికలు 8) ఉత్తీర్ణులు కాలేదు.
2022లో 19.. 2026లో 23వ ర్యాంకు..
జిల్లాలో పదో తరగతి ఫలితాలను ఐదు సంవత్సరాల నుంచి విశ్లేషిస్తే మూడేళ్లుగా ఉత్తీర్ణత శాతం పెరుగుతోంది. కానీ, రాష్ట్రస్థాయి ర్యాంకు మాత్రం అప్‌డౌన్ అవుతోంది. కరోనా తర్వాత జరిగిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 91.21 శాతం ఉత్తీర్ణత సాధించిన జిల్లాకు 19వ ర్యాంకు వస్తే...95.17 శాతం పాసైనా 2026లో 23వ ర్యాంకుకు పడిపోయింది. ఫెయిలైనా వారి సంఖ్య క్రమేపీ తగ్గుతున్నా రాష్ట్ర స్థాయిలో మాత్రం జిల్లా ర్యాంకు మెరుగవడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. ఉమ్మడి వరంగల్‌లోనూ ఈసారి పదో తరగతి ఫలితాల్లో అట్టడుగున ఉండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.
ఐదు సంవత్సరాలుగా జిల్లాలో పదో తరగతి ఫలితాల వివరాలు..
86 మంది విద్యార్థులకు
550కిపైనే మార్కులు..
ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మార్కుల వేటలో ముందున్నారు. వరంగల్ కృష్ణా కాలనీలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని మహమ్మద్ ముదస్సిర్‌కు 589 మార్కులు వచ్చాయి. 572 నుంచి 589 మార్కులొచ్చిన టాప్ టెన్ విద్యార్థుల్లో అందరు బాలికలు ఉండడం విశేషం. 86 మంది విద్యార్థులకు 550పైనే ఈసారి మార్కులు తెచ్చుకోవడంతో ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సంవత్సరం హాజరైంది ఉత్తీర్ణత ఫెయిలైంది ఉత్తీర్ణత శాతం స్టేట్ ర్యాంకు
2022 9,881 9,111 770 92.21 19
2023 9,710 8,701 1009 89.61 16
2024 9,445 8,708 737 92.20 22
2025 9,237 8,588 649 92.97 21
2026 9,492 9,034 458 95.17 23


